Pele in hospital: క్యాన్సర్‌తో హాస్పిటల్లో బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే.. పరిస్థితి విషమం-pele in hospital fighting with cancer ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pele In Hospital: క్యాన్సర్‌తో హాస్పిటల్లో బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే.. పరిస్థితి విషమం

Pele in hospital: క్యాన్సర్‌తో హాస్పిటల్లో బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే.. పరిస్థితి విషమం

Hari Prasad S HT Telugu
Nov 30, 2022 10:11 PM IST

Pele in hospital: క్యాన్సర్‌తో పోరాడుతూ హాస్పిటల్లో చేరాడు బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఎమర్జెన్సీ ఏమీ లేదని పీలే కూతురు సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే
బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే (REUTERS)

Pele in hospital: బ్రెజిల్‌ సాకర్‌ లెజెండ్‌ పీలే హాస్పిటల్లో చేరాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న అతన్ని పరిస్థితి విషమించడంతో బుధవారం హాస్పిటల్లో చేర్చారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం కానీ, ఎమర్జెన్సీ కానీ ఏమీ లేదని అతని కూతురు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈఎస్పీఎన్‌ బ్రెజిల్‌ మొదట పీలే హాస్పిటల్‌లో చేరినట్లు రిపోర్ట్ చేసింది.

ఆ వెంటనే పీలే కూతురు కెలీ నాసిమెంటో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అతని ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చింది. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ హాస్పిటల్‌లో చేరిన పీలేకు పరీక్షలు జరుగుతున్నాయని, ఆ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితిపై ఓ స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

"మా నాన్నా ఆరోగ్యం గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. చికిత్స కోసమే ఆయన హాస్పిటల్‌లో ఉన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదు. భయపడాల్సింది కూడా లేదు. న్యూఇయర్‌కు నేను వస్తాను. ఫొటోలు కూడా పోస్ట్‌ చేస్తాను" అని నాసిమెంటో ఇన్‌స్టాలో చెప్పింది.

గతేడాది సెప్టెంబర్‌లో 82 ఏళ్ల పీలే పెద్ద పేగు నుంచి ట్యూమర్‌ను తొలగించారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవుతూ, వస్తూ ఉన్నాడు. అతనికి కీమో థెరపీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అతనికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, కీమో థెరపీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని ఈఎస్పీఎన్‌ బ్రెజిల్ రిపోర్ట్‌ చేసింది.

ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచాడు. తన కెరీర్‌లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్‌ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్‌ రికార్డు కావడం విశేషం. ఇక బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్‌ చేశాడు.

Whats_app_banner

టాపిక్