Novak Djokovic: గ్రాండ్‌స్లామ్‌ నంబర్‌ 21.. వింబుల్డన్‌ ఛాంపియన్‌ జోకొవిచ్-novak djokovic wins his seventh wimbledon and 21st grand slam title ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Novak Djokovic: గ్రాండ్‌స్లామ్‌ నంబర్‌ 21.. వింబుల్డన్‌ ఛాంపియన్‌ జోకొవిచ్

Novak Djokovic: గ్రాండ్‌స్లామ్‌ నంబర్‌ 21.. వింబుల్డన్‌ ఛాంపియన్‌ జోకొవిచ్

Hari Prasad S HT Telugu
Jul 11, 2022 05:55 AM IST

Novak Djokovic: సెర్బియన్‌ సెన్సేషన్‌ నొవాక్‌ జోకొవిచ్ వింబుల్డన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో గెలిచి కెరీర్‌లో ఏడో వింబుల్డన్‌, 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు.

వింబుల్డన్ టైటిల్ ఏడోసారి గెలిచిన నొవాక్ జోకొవిచ్
వింబుల్డన్ టైటిల్ ఏడోసారి గెలిచిన నొవాక్ జోకొవిచ్ (AP)

లండన్‌: టాప్‌ సీడ్‌ నొవాక్‌ జోకొవిచ్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. వింబుల్డన్‌ టైటిల్‌ను ఏడోసారి గెలిచి ది గ్రేట్‌ పీట్ సంప్రాస్‌ రికార్డును సమం చేశాడు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెదరర్‌ 8 వింబుల్డన్‌ టైటిళ్ల రికార్డుకు మరో టైటిల దూరంలో నిలిచాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో కిర్గియోస్‌పై 4-6, 6-3, 6-4, 7-6 (7/3) తేడాతో గెలిచాడు జోకొవిచ్‌.

ఓవరాల్‌గా అతనికిది 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. స్పెయిన్‌ బుల్‌ రఫేల్ నదాల్‌ (22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌) తర్వాత అత్యధిక టైటిల్స్‌ సాధించిన రెండో ప్లేయర్‌గా అవతరించాడు. ఇన్నాళ్లూ రోజర్‌ ఫెదరర్‌ (20 టైటిల్స్‌)తో కలిసి రెండో స్థానంలో ఉన్న జోకొవిచ్‌.. ఇప్పుడు అతన్ని వెనక్కి నెట్టాడు. తొలి సెట్‌లో వెనుకబడి తర్వాత పుంజుకునే తన స్టైల్‌ను ఫైనల్లోనూ కొనసాగించిన నొవాక్‌.. ప్రత్యర్థి కిర్గియోస్‌ ఏకాగ్రత దెబ్బతినే వరకూ వేచి చూసి తర్వాత తన పని ముగించాడు.

ఫెదరర్‌ తర్వాత వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన అత్యంత పెద్ద వయసు ప్లేయర్‌గా జోకొవిచ్‌ (35 ఏళ్లు) నిలిచాడు. ఫెడెక్స్‌ 36 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ గెలిచాడు. నిజానికి రఫేల్ నదాల్‌ గాయం కారణంగా సెమీఫైనల్‌కు ముందు తప్పుకున్నప్పుడే జోకొవిచ్‌ విజయం ఖాయం అని అందరూ ఊహించారు. నదాల్‌ రూపంలో ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోవడంతో నొవాక్‌ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి కేలండర్‌ స్లామ్‌పై కన్నేసిన నదాల్‌.. అనూహ్యంగా పొట్ట కండరాల్లో చీలిక కారణంగా సెమీఫైనల్‌కు ముందు తప్పుకున్న విషయం తెలిసిందే.

<p>జోకొవిచ్ గెలిచిన ఏడు వింబుల్డన్ టైటిల్స్</p>
జోకొవిచ్ గెలిచిన ఏడు వింబుల్డన్ టైటిల్స్ (AFP)
WhatsApp channel

సంబంధిత కథనం