lausanne diamond league : చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. రీఎంట్రీలో అదిరిపోయే రికార్డు
ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకొని అదిరిపోయే ప్రదర్శన చేశాడు. లూసానే డైమండ్ లీగ్‌లో 89.08 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు. ఏ భారతీయుడు అందుకోలేని ఘనతను దక్కించుకున్నాడు.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రికార్డుల సునామీ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఇప్పటికే నేషనల్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ జావెలిన్ త్రోయర్.. తాజాగా మరోసారి అదిరిపోయే ఘనతను సాధించాడు. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైన నీరజ్.. తన పునరాగమాన్ని ఘనంగా చాటాడు. లూసానే డైమండ్ లీగ్‌లో తొలి ప్రయత్నంలోనే 89.08 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. అతడికి దరిదాపులో కూడా ఎవరూ లేరు.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్ వద్లేచ్ 85.88 మీటర్లతో రెండో స్థానంలో ఉండగా.. అమెరికాకు చెందిన కర్టీస్ థాంప్సన్ మూడో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగులో ఓ భారత క్రీడాకారుడు టాప్‌లో నిలవడం ఇదే మొదటిసారి. ఓరెగాన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ తర్వాత గాయపడిన నీరజ్.. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తొలి టోర్నీలోనే నీరజ్ చోప్రా అగ్రస్థానాన్ని కైసం చేసుకున్నాడు.
తొలి ప్రయత్నంలో నీరజ్ 89.08 మీటర్లు విసరగా.. రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలో నీరజ్ చోప్రా విసిరిరనంత దూరం ఓ పోటీదారుడు అందుకోకపోవడం గమనార్హం. మూడో ప్రయత్నాన్ని విరమించుకోగా.. నాలుగో ప్రయత్నంలో మాత్రం ఫౌల్ అయ్యాడు. అప్పటి వరకు అతడికి సమీపంలో కూడా ఎవ్వరూ రాలేదు. రెండో స్థానంలో నిలిచిన వద్లేచ్ కూడా ఐదో ప్రయత్నంతో తన అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
నీరజ్ చోప్రా తన చివరి ప్రయత్నంలో 80.08 మీటర్లతో పోటీని ముగించాడు. అయినప్పటికీ తన గణాంకాలకు ఎవ్వరూ అందుకోకపోవడంతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ప్రారంబంలో జరిగిన డైమండ్ లీగులో నీరజ్ చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. తాజాగా తన ప్రదర్శనతో స్థానాన్ని మెరుగుపరచుకున్నాడు. ఇప్పటికే తాను క్రియేట్ చేసిన నేషనల్ రికార్డును రెండు సార్లు బద్దలు కొట్టాడు.
సంబంధిత కథనం
టాపిక్