IPL 2022 MI vs RCB | ఆర్సీబీని గెలిపించిన అనూజ్‌, విరాట్‌.. ముంబైకి వరుసగా నాలుగో ఓటమి-mi suffers fourth loss as rcb beat them convincingly in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 Mi Vs Rcb | ఆర్సీబీని గెలిపించిన అనూజ్‌, విరాట్‌.. ముంబైకి వరుసగా నాలుగో ఓటమి

IPL 2022 MI vs RCB | ఆర్సీబీని గెలిపించిన అనూజ్‌, విరాట్‌.. ముంబైకి వరుసగా నాలుగో ఓటమి

Hari Prasad S HT Telugu
Apr 09, 2022 11:26 PM IST

ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో బోణీ చేయలేకపోతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆ టీమ్‌కు ఓటమి తప్పలేదు.

<p>హాఫ్ సెంచరీతో ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన అనూజ్ రావత్</p>
హాఫ్ సెంచరీతో ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన అనూజ్ రావత్ (PTI)

పుణె: ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబై కూడా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూట్‌లోనే వెళ్తోంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో బోణీ చేయలేక తంటాలు పడుతోంది. వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకొని పాయింట్ల టేబుల్లో 9వ స్థానంలో ఉంది. యువ ఓపెనర్‌ అనూజ్‌ రావత్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెలరేగడంతో 152 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 9 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి చేజ్‌ చేసింది. ఓపెనర్‌ రావత్‌ 47 బంతుల్లోనే 66 రన్స్‌ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు కోహ్లి 36 బంతుల్లో 48 పరుగులు చేసి వివాదాస్పద రీతిలో వెనుదిరిగాడు. బాల్‌ బ్యాట్‌కు తగిలి ప్యాడ్‌కు తగిలినా.. థర్డ్‌ అంపైర్‌ అతన్ని ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ వరుసగా రెండు ఫోర్లు బాది టీమ్‌ను గెలిపించాడు. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయానికి అవసరమైన 152 రన్స్‌ చేసింది.

చేజింగ్‌ను ఆర్సీబీ కాన్ఫిడెంట్‌గానే మొదలుపెట్టింది. రెండో ఓవర్లోనే ఉనద్కట్‌ బౌలింగ్‌లో అనూజ్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఇద్దరూ కలిసి 8 ఓవర్లలో 50 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్‌ డుప్లెస్సి (16) ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. వచ్చీరాగానే దూకుడుగా ఆడాడు. అనూజ్‌తో కలిసి ముంబై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఇద్దరూ ప్రతి ఓవర్‌కూ కనీసం ఒక బౌండరీ బాదుతూ.. ఆర్సీబీని విజయం దిశగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనూజ్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత 17వ ఓవర్లో అనూజ్‌ రనౌటయ్యాడు.

సూర్యకుమార్‌ ఒక్కడే..

అంతకుముందు వరుసగా ఆడిన రెండో మ్యాచ్‌లోనూ సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ టీమ్‌ను ఆదుకున్నాడు. ఆర్సీబీ దెబ్బకు ఒక దశలో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైకి ఫైటింగ్‌ స్కోరు అందించాడు. సూర్యకుమార్‌ చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 రన్స్‌ చేసింది. అతని దెబ్బకు ఆర్సీబీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్‌ వేసిన 19వ ఓవర్లోనే మూడు సిక్స్‌లు బాదాడు సూర్యకుమార్. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే సిరాజ్‌ 23 రన్స్‌ ఇచ్చాడు. చివరికి సూర్యకుమార్‌ 37 బంతుల్లోనే 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉన్నాయి.

ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడిన ముంబై ఈ మ్యాచ్‌లో చాలా జాగ్రత్తగా బ్యాటింగ్‌ మొదలుపెట్టింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ఆచితూచి ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలో 50 రన్స్‌ జోడించిన తర్వాత రోహిత్‌ (26) ఔటయ్యాడు. ఇక అప్పటి నుంచి ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. 62 పరుగులకు వచ్చేసరికి 5 వికెట్లు పడిపోయాయి. రోహిత్‌ తర్వాత ఇషాన్‌ (26) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. డివాల్డ్‌ బ్రెవిస్‌ (8), తిలక్‌ వర్మ (0), పొలార్డ్‌ (0) వెంటవెంటనే ఔటయ్యారు. అయితే సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే చివరి వరకూ పోరాడాడు. బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఉనద్కట్‌తో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించాడు.

Whats_app_banner

టాపిక్