Mastercard as BCCI Sponsor: బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్‌గా మాస్టర్‌కార్డ్‌-mastercard as bcci title sponsor for domestic and international matches on home soil ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mastercard As Bcci Sponsor: బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్‌గా మాస్టర్‌కార్డ్‌

Mastercard as BCCI Sponsor: బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్‌గా మాస్టర్‌కార్డ్‌

Hari Prasad S HT Telugu

Mastercard as BCCI Sponsor: బీసీసీఐ కొత్త టైటిల్‌ స్పాన్సర్‌గా మాస్టర్‌కార్డ్‌ వచ్చేసింది. ఇన్నాళ్లూ పేటీఎం ఉండగా.. ఈ సీజన్‌ నుంచి మాస్టర్‌కార్డ్‌ ఉండనుంది.

ఇండియాలో జరగబోయే ఇంటర్నేషనల్ సిరీస్ లకు స్పాన్సర్ గా మాస్టర్ కార్డ్

Mastercard as BCCI Sponsor: ఇండియాలో టీమిండియా ఆడే అన్ని ఇంటర్నేషనల్ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఇక నుంచి టైటిల్‌ స్పాన్సర్‌గా మాస్టర్‌కార్డ్‌ వ్యవహరించనుంది. దీంతోపాటు దేశవాళీ క్రికెట్‌ టోర్నీలైన ఇరానీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీలు, అండర్‌ 19, అండర్ 23లాంటి జూనియర్‌ క్రికెట్‌ టోర్నీలకు కూడా ఈ సంస్థే స్పాన్సర్‌గా ఉంటుంది.

2022-23 సీజన్‌ నుంచే మాస్టర్‌ కార్డ్‌ స్పాన్సర్‌షిప్‌ ప్రారంభమవుతుంది. ఈ డీల్‌తో మాస్టర్‌కార్డ్‌ మరో పెద్ద స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్‌ లీగ్‌, ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలు, గ్రామీ అవార్డులు, కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లకు కూడా మాస్టర్‌కార్డ్‌ స్పాన్సర్‌గా ఉంది. ఈ కొత్త స్పాన్సర్‌షిప్‌ డీల్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడారు.

"మాస్టర్‌కార్డ్‌ను టైటిల్‌ స్పాన్సర్‌గా మేము స్వాగతిస్తున్నాం. ఇండియాలో జరిగే ఇంటర్నేషనల్‌ హోమ్‌ సిరీస్‌తోపాటు ఇండియన్‌ టీమ్‌ను అంతర్జాతీయంగా పటిష్టంగా మార్చడంలో కీలకపాత్ర పోషించే డొమెస్టిక్‌ టోర్నీలు కూడా ఎంతో ముఖ్యం. దేశంలో క్రికెట్‌ ఓ జీవన విధానం. ఈ పార్ట్‌నర్‌షిప్‌ ద్వారా ఫ్యాన్స్‌కు వినూత్న అనుభూతిని అందించడానికి ప్రయత్నిస్తాం" అని గంగూలీ అన్నారు.

ఈ సీజన్‌ టీమిండియా చాలా బిజీగా ఉండనుంది. రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లు కూడా జరగనున్నాయి. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌లతోపాటు ఆస్ట్రేలియాతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ కూడా జరగనుంది. ఆ లెక్కన మాస్టర్‌కార్డ్‌ సరైన టైమ్‌లో మంచి డీల్‌ కుదుర్చుకుందనే చెప్పాలి. అటు బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా మాస్టర్‌కార్డ్‌ డీల్‌పై స్పందించారు.