Jay Shah: బీసీసీఐ సెక్రటరీ జై షాకి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు సొంతం
Jay Shah: బీసీసీఐ సెక్రటరీ జై షాకి అరుదైన గౌరవం దక్కింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తోపాటు వరల్డ్ కప్ నిర్వహించినందుకుగాను 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.
Jay Shah: ఇండియన్ క్రికెట్ ను నడిపించే బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. 2023లో వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించడం, ఈ మధ్యే విజయవంతంగా వరల్డ్ కప్ నిర్వహించిన కారణంగా ఆయనను ఈ అవార్డు వరించింది. జై షా ఈ అవార్డు అందుకున్న విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అనౌన్స్ చేసింది.
ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఇంత వరకూ ఎవరికీ దక్కని ఈ అవార్డు తొలిసారి జై షాని వరించడం విశేషం. ఇండియన్ క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డుతో సత్కరించారు. క్రికెట్ లో పురుషులు, మహిళలకు ఒకే వేతనం.. ఐపీఎల్ తో సమానంగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించడం, ఒలింపిక్స్ లో క్రికెట్ కు స్థానం కల్పించేందుకు కృషి చేయడం, విజయవంతంగా వరల్డ్ కప్ నిర్వహించిన ఘనత జై షాకి దక్కుతుందని బోర్డు తన ట్వీట్ లో తెలిపింది.
"స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షాకి శుభాకాంక్షలు. ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఇంత వరకూ ఎవరికీ దక్కని అవార్డుకు మీరు పూర్తిగా అర్హులు. ఆయన నాయకత్వం క్రికెట్ ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది" అని బీసీసీఐ కొనియాడింది.
బీసీసీఐ కార్యదర్శిగానే కాకుండా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ జై షా కొనసాగుతున్నారు. బీసీసీఐలో చేరే ముందు ఆయన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పని చేశారు. బోర్డు సెక్రటరీగా ఇండియన్ క్రికెట్ లో మెన్, వుమెన్ క్రికెటర్లకు సమాన వేతనానికి కృషి చేశారు. 2019లో జై షా బోర్డు సెక్రటరీగా నియమితులయ్యారు.
ఆ మరుసటి ఏడాది కొవిడ్ కారణంగా బీసీసీఐ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. ఆ సవాళ్లను సమర్థంగా అధిగమించడంలో జై షా కీలకపాత్ర పోషించారు. ఐపీఎల్లో రెండు కొత్త జట్లను తీసుకువచ్చి బోర్డు ఆదాయాన్ని అమాంతం పెంచేశారు. అంతేకాదు బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల ద్వారా కూడా వేల కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి.