Ind vs SA: రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ వచ్చినా ఓపెనర్‌గా అతడు ఉండాల్సిందే: గంభీర్‌-ishan kishan should be there even after rohit kohli and rahul return says gambhir ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa: రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ వచ్చినా ఓపెనర్‌గా అతడు ఉండాల్సిందే: గంభీర్‌

Ind vs SA: రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ వచ్చినా ఓపెనర్‌గా అతడు ఉండాల్సిందే: గంభీర్‌

Hari Prasad S HT Telugu
Jun 13, 2022 12:39 PM IST

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లాంటి టాప్‌ 3 బ్యాటర్లు సౌతాఫ్రికాతో సిరీస్‌కు లేకపోవడంతో కొందరు యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కుతోంది. అయితే ఈ ముగ్గురూ వచ్చిన తర్వాత కూడా ఓ ప్లేయర్‌ మాత్రం ఉండాల్సిందే అంటున్నాడు మాజీ ప్లేయర్‌ గౌతమ్‌ గంభీర్‌.

<p>ఇషాన్ కిషన్</p>
ఇషాన్ కిషన్ (PTI)

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు టీ20ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. ఓసారి బౌలింగ్‌, మరోసారి బ్యాటింగ్‌ వైఫల్యాలతో ఓటమి కొనితెచ్చుకుంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓ ప్లేయర్‌ ఆడిన తీరు మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌కు బాగా నచ్చింది. అందుకే అతన్ని టీమ్‌తోనే కొనసాగించాలని, టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ఉండాలని అంటున్నాడు.

ఆ ప్లేయర్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌. అతడు రెండు మ్యాచ్‌లు కలిపి పవర్‌ ప్లేలో 41 బాల్స్‌ ఆడి 55 రన్స్‌ చేశాడు. ఈ మధ్య కాలంలో పవర్‌ ప్లేలో ఇండియన్‌ బ్యాటర్లు తడబడటం చూస్తున్నాం. కానీ ఇషాన్‌ పవర్‌ ప్లేలో ఆడుతున్న తీరుపై గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. అయితే ప్రస్తుతం రోహిత్‌, రాహుల్‌, కోహ్లిలాంటి టాప్‌ 3 బ్యాటర్లు లేకపోవడంతో ఇషాన్‌కు ఓపెనింగ్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది.

ఆ ముగ్గురూ వస్తే అతనికి చోటు దక్కేది డౌటే. అయితే గంభీర్‌ మాత్రం ఇషాన్‌ ఉండాల్సిందే అంటున్నాడు. రెండో మ్యాచ్‌ తర్వాత స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఇషాన్‌ను కొనసాగించేలా చూడాలని కోరాడు. "ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. రాహుల్‌, రోహిత్‌, విరాట్‌ తిరిగి వచ్చిన తర్వాత వీళ్లను ఇండియన్‌ టీమ్‌లో కొనసాగనిస్తారా? మనం తరచూ ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అని, భయం లేని క్రికెట్‌ ఆడాలని చెబుతుంటాం. ఇషాన్‌ రన్స్‌ చేసినా చేయకపోయినా ఆ భయంలేని క్రికెట్‌ ఆడగలడు.

అందువల్ల ఇషాన్‌, రోహిత్‌తో ఇన్నింగ్స్‌ ప్రారంభించి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తారా. నా ఉద్దేశం ప్రకారం ఆస్ట్రేలియా కండిషన్స్‌లో అతడు ఉండాల్సిందే. అక్కడి వికెట్లలో బౌన్స్‌ ఉంటుంది. బ్యాక్‌ఫుట్‌పై పుల్‌షాట్స్‌, లెంత్‌ బాల్‌ను బాగా ఆడే సామర్థ్యం ఇషాన్‌కు ఉంది. అందుకే టీ20 వరల్డ్‌కప్‌లో ఇషాన్‌ ఉండాలి. ఆ ఉద్దేశం వాళ్లకు ఉంటే అతన్ని వరల్డ్‌కప్‌ వరకూ కొనసాగిస్తారు" అని గంభీర్‌ అన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం