Suryakumar Stunning Sixer: సూర్యకుమార్ స్టన్నింగ్ సిక్సర్.. సచిన్ సైతం షాక్..!
Suryakumar Stunning Sixer: గుజరాత్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సిక్సర్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ సైతం షాక్ అయ్యారు. ఆ షాట్ అతడు ఎలా ఆడాడో అనుకరించి చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Suryakumar Stunning Sixer: సూర్యకుమార్ యాదవ్ శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌లో తొలి సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ముంబయి ఇండియన్స్ 218 పరుగులు భారీ స్కోరు చేసి గుజరాత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 103 పరుగులు చేసిన సూర్యకుమార్.. 11 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అతడి హిట్టింగ్ నైపుణ్యాన్ని చూసిన పలువురు మాజీలు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఓ సిక్సర్‌ను అతడు థర్డ్ మ్యాన్ దిశగా కొట్టిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సచిన్ తెందూల్కర్ సైతం సూర్యకుమార్ హిట్టింగ్ నైపుణ్యానికి ఫిదా అయ్యారు.
బంతిని బ్యాట్‌తో కోసినట్లుగా సూర్యకుమార్ ఆడటంతో బాల్ థర్డ్ మ్యాన్ దిశగా సిక్సర్ వెళ్తుంది. అయితే ఆ బంతిని సూర్య కవర్స్ దిశగా కొడదామనుకుంటాడు. కానీ అది టాప్ ఎడ్జ్ తీసుకొని వేగంగా బౌండరీ లైన్‌ను దాటేస్తుంది. ఆ షాట్ చూసిన సచిన్ సైతం ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా ఆ షాట్‌ను సూర్యకుమార్ ఎలా కొట్టాడో కూడా అనుసరింతి బంతి ఎలా వెళ్లిందో చేసి చూపించాడు. కెమెరాలో సచిన్ అనుకరించడం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
సూర్యకుమార్ కొట్టిన సిక్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ కూడా స్పందించారు. "థర్డ్ మ్యాన్ దిశగా వర్టికల్‌గా సిక్స్ కొట్టడం నేనెప్పుడు చూడలేదు. హారిజంటల్‌గా కొట్టడం చూశాను. అన్నీ ఫార్మాట్లలో నా జీవిత కాలంలో దాదాపు 10 మిలియన్ బంతులను చూసుంటాను. కానీ ఇలాంటి షాట్ చూడలేదు. అలాంటి షాట్‌ను ఇంకెవ్వరూ కొట్టలేరు" అని టామ్ మూడీ అన్నారు.
ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ గుజరాత్‌పై 27 పరుగుల తేడాతో గెలిచింది. 218 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్.. టాపార్డర్ విఫలం కాగా..స్పిన్నర్ రషీద్ ఖాన్ తన భీకర ప్రదర్శనతో చివరి వరకు పోరాడాడు. 32 బంతుల్లో 79 పరుగులు చేసినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టాడు. 4 వికెట్లుతో పాటు అర్ధశతకంతో రాణించాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ 3 వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయ, పియూష్ చావ్లా చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.