Jonty Rhodes: జాంటీ రోడ్స్ గొప్ప మనసు.. కవర్స్ లాగడానికి గ్రౌండ్‌మెన్‌కి సాయం చేసిన లక్నో ఫీల్డింగ్ కోచ్-jonty rhodes showed his big heart by helping groundmen to pull the cover ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jonty Rhodes: జాంటీ రోడ్స్ గొప్ప మనసు.. కవర్స్ లాగడానికి గ్రౌండ్‌మెన్‌కి సాయం చేసిన లక్నో ఫీల్డింగ్ కోచ్

Jonty Rhodes: జాంటీ రోడ్స్ గొప్ప మనసు.. కవర్స్ లాగడానికి గ్రౌండ్‌మెన్‌కి సాయం చేసిన లక్నో ఫీల్డింగ్ కోచ్

Hari Prasad S HT Telugu
May 03, 2023 07:34 PM IST

Jonty Rhodes: జాంటీ రోడ్స్ గొప్ప మనసు చాటుకున్నాడు. వర్షం పడుతున్న సమయంలో కవర్స్ లాగడానికి గ్రౌండ్‌మెన్‌కి సాయం చేశాడు ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్. ఈ వీడియో వైరల్ అవుతోంది.

కవర్ లాగుతున్న జాంటీ రోడ్స్
కవర్ లాగుతున్న జాంటీ రోడ్స్

Jonty Rhodes: క్రికెట్ లో వర్షం పడినప్పుడు గ్రౌండ్ మెన్ పరుగెత్తుకుంటూ వచ్చి పిచ్ పై కవర్లు కప్పడం చూసే ఉంటారు. కాస్త ఆలస్యమైనా వర్షం కారణంగా పిచ్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో వాళ్లు పరుగుపరుగున వస్తుంటారు. ఆ వర్షంలో వాళ్లు చాలా బాధలే పడతారు. అయితే ఆ గ్రౌండ్ మెన్ పడుతున్న ఇబ్బంది చూసి ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ వాళ్లకు సాయం చేశాడు.

బుధవారం (మే 3) చెన్నై, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విటర్ లో షేర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఒక్కసారిగా భారీ వర్షం రాగా.. పిచ్ పై కవర్లు కప్పడానికి గ్రౌండ్ సిబ్బంది కవర్లు లాగడానికి బౌండరీ దగ్గరికి వెళ్లారు. వాళ్ల వెంట జాంటీ రోడ్స్ కూడా పరుగెత్తుకుంటూ వెళ్లి కవర్ పట్టుకున్నాడు.

అది చూసిన సిబ్బంది వద్దని వారించినా అతడు వినలేదు. అలాగే లాగుతూ వెళ్లాడు. ఒక దశలో అతని చేతి నుంచి కవర్ లాక్కున్నా.. ఓ చోట ఎవరూ లేకపోవడంతో అతడు మళ్లీ వెళ్లి కవర్ పట్టుకొని లాగాడు. ఈ సందర్భంగా జాంటీ నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియోను ఐపీఎల్ షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది. జాంటీ గొప్ప మనసు చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు.

లక్నో, చెన్నై మ్యాచ్ రద్దు

అయితే ఈ సీజన్ ఐపీఎల్లో వర్షం కారణంగా తొలిసారి ఓ మ్యాచ్ రద్దయింది. లక్నోలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లక్నో, చెన్నై మ్యాచ్ ను రద్దు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసిన సమయంలో వర్షం ప్రారంభమైంది. తర్వాత ఎంతసేపటికీ వర్షం వీడకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు.

దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ వచ్చింది. ఈ మ్యాచ్ రద్దయిన తర్వాత చెరో 11 పాయింట్లతో లక్నో, చెన్నై రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత ఈ మ్యాచ్ రద్దవడంతో చెన్నైకి ఒక పాయింట్ వచ్చింది. అటు ఆర్సీబీ చేతిలో సొంతగడ్డపై ఓడిన లక్నోకు కూడా ఈ మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ ఖాతాలో చేరింది.

ఈ మ్యాచ్ లో లక్నో బ్యాటర్లంతా విఫలం కాగా.. ఆయుష్ బదోనీ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు 33 బంతుల్లోనే 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్యాటింగ్ కు అస్సలు అనుకూలించని పిచ్ పై బదోనీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో పిచ్ పై 130 పరుగుల లక్ష్యం ఛేదించడం కూడా కష్టమే. ఒకవేళ ఈ మ్యాచ్ సాగి ఉంటే చెన్నైకి సవాలుగా ఉండేది.

WhatsApp channel

సంబంధిత కథనం