India Hockey Team: ఇండియాకు మరో మెడల్ .. బ్రాంజ్ మెడల్ గెలిచిన హాకీ టీమ్.. స్పెయిన్‌ను ఓడించి టోక్యో రికార్డు రిపీట్-indian hockey team win bronze medal in paris olympics 2024 beat spain in bronze medal match harmanpreet singh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Hockey Team: ఇండియాకు మరో మెడల్ .. బ్రాంజ్ మెడల్ గెలిచిన హాకీ టీమ్.. స్పెయిన్‌ను ఓడించి టోక్యో రికార్డు రిపీట్

India Hockey Team: ఇండియాకు మరో మెడల్ .. బ్రాంజ్ మెడల్ గెలిచిన హాకీ టీమ్.. స్పెయిన్‌ను ఓడించి టోక్యో రికార్డు రిపీట్

Hari Prasad S HT Telugu
Aug 08, 2024 07:48 PM IST

India Hockey Team: టోక్యో ఒలింపిక్స్ రికార్డును ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ రిపీట్ చేసింది. స్పెయిన్ ను మట్టి కరిపించి బ్రాంజ్ మెడల్ గెలిచింది. దీంతో పారిస్ లో ఇండియా మెడల్స్ సంఖ్య నాలుగుకి చేరింది.

ఇండియాకు మరో మెడల్ .. బ్రాంజ్ మెడల్ గెలిచిన హాకీ టీమ్.. స్పెయిన్‌ను ఓడించి టోక్యో రికార్డు రిపీట్
ఇండియాకు మరో మెడల్ .. బ్రాంజ్ మెడల్ గెలిచిన హాకీ టీమ్.. స్పెయిన్‌ను ఓడించి టోక్యో రికార్డు రిపీట్ (AP)

India Hockey Team: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు మరో మెడల్ వచ్చింది. ఇండియా హాకీ టీమ్ మరోసారి బ్రాంజ్ మెడల్ గెలిచింది. మూడేళ్ల కిందట టోక్యోలో బ్రాంజ్ గెలిచి నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన మన హాకీ టీమ్.. మళ్లీ ఇప్పుడు కూడా బ్రాంజ్ మెడల్ గెలిచింది. 52 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే వరుసగా రెండు ఒలింపిక్స్ లో ఇండియా మెడల్స్ గెలిచింది. స్పెయిన్ ను 2-1తో చిత్తు చేసింది.

హాకీ టీమ్‌కు బ్రాంజ్ మెడల్

సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన భారత హాకీ జట్టు రెండు రోజులకే కాంస్య పతకం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం అద్భుత ఆటతీరును ప్రదర్శించి స్పెయిన్ ను 2-1 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి కాంస్య పతకం సాధించింది. 2024 ఒలింపిక్స్ లో ఇండియాకు ఇది నాలుగో పతకం.

ఇప్పటికే మూడు బ్రాంజ్ మెడల్స్ షూటింగ్ లో రాగా.. తొలిసారి మరో క్రీడలో అంటే హాకీలోనూ బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో ఇండియా ఆటతీరు అద్భుతంగా సాగింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే పెనాల్టీ ద్వారా గోల్ సాధించి స్పెయిన్ లీడ్ లోకి వెళ్లింది. అయితే తొలి క్వార్టర్ చివరి నిమిషంలో గోల్ చేసిన ఇండియా స్కోరును 1-1తో సమం చేసింది.

ఆ తర్వాత సెకండాఫ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ కు గోల్ గా మలిచాడు. దీంతో ఇండియాకు 2-1 ఆధిక్యం లభించింది. ఆ లీడ్ ను ఇండియా చివరి వరకు కొనసాగించి చివరికి 2-1తోనే మ్యాచ్ గెలిచింది. వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ బ్రాంజ్ మెడల్ గెలిచి ఇండియన్ హాకీ ఓ వెలుగు వెలిగింది.

అద్భుత ప్రయాణం

పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీమ్ ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. హెవీవెయిట్స్ ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో గ్రూప్ లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 40 నిమిషాలకు పైగా ఒకే ఆటగాడితో పోరాడినా గ్రేట్ బ్రిటన్ పై భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. ఆలస్యంగా వచ్చిన జర్మన్ గోల్ భారత్ స్వర్ణం ఆశలకు ముగింపు పలికినప్పటికీ ఆ జట్టు పోరాట పటిమ ఏమాత్రం తగ్గలేదు.

జర్మనీ చేతుల్లో ఓడిన రెండు రోజులకే స్పెయిన్ ను చిత్తు చేసి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. తమ దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో భారత్ కాంస్య పతకం పోరు ప్రాధాన్యతను సంతరించుకుంది. 2006లో అరంగేట్రం చేసిన ఈ గోల్ కీపర్ 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు మరో బ్రాంజ్ మెడల్ తో శ్రీజేష్ తన కెరీర్ కు గొప్ప ముగింపు పలికాడు.

ఈ బ్రాంజ్ మెడల్ ను తాము పీఆర్ శ్రేజేష్ కు అంకితమిస్తున్నట్లు ఇండియన్ ప్లేయర్ మణ్‌ప్రీత్ సింగ్ అన్నాడు. అతనితో కలిసి తాను 13 ఏళ్లు ఆడానని, ఈ మెడల్ అతనికి కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉందన్నాడు. తమకు అండగా నిలిచిన మొత్తం దేశానికి అతడు థ్యాంక్స్ చెప్పాడు.

Whats_app_banner