Ind vs SA: ఇండియా, సౌతాఫ్రికా చివరి టీ20 మ్యాచ్ రద్దు.. సిరీస్ 2-2తో సమం
ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన ఐదో టీ20 వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేకపోయింది.
బెంగళూరు: ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించి ఇండియా, సౌతాఫ్రికా సిరీస్ చివరికి ఫలితం తేలకుండానే ముగిసింది. చివరి టీ20 వర్షం కారణంగా రద్దవడంతో ఈ సిరీస్‌ను రెండు టీమ్స్ పంచుకోనున్నాయి. తొలి నాలుగు టీ20లలో రెండు టీమ్స్ చెరో రెండు గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం బెంగళూరు టీ20 నిర్ణాయాత్మకంగా మారింది.
అయితే మ్యాచ్ మొదలు కాక ముందు నుంచే వర్షం వెంటాడింది. మ్యాచ్ 7.50 గంటలకు ప్రారంభమైనా.. కేవలం 3.3 ఓవర్లు మాత్రమే సాధ్యమైంది. ఆ ఓవర్లలో ఇండియా 2 వికెట్లకు 28 రన్స్ చేసింది. ఆ సమయంలో భారీ వర్షం మొదలైంది. సుమారు గంటన్నర పాటు వర్షం కురుస్తూనే ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
చివరి మ్యాచ్ రద్దవడంతో సౌతాఫ్రికా తన తిరుగులేని రికార్డును కొనసాగించింది. 2011 నుంచి ఆ టీమ్ ఇండియాలో ఒక్క పరిమిత ఓవర్ల టోర్నమెంట్‌ను కూడా ఓడిపోలేదు. ఇప్పుడు సిరీస్ 2-2తో సమంగా ఉన్న సమయంలో చివరి మ్యాచ్ రద్దవడంతో సిరీస్ విజేత ఎవరో తేలకుండానే ముగిసింది. ఈసారి తొలి రెండు టీ20లను సౌతాఫ్రికా గెలవగా.. తర్వాత రెండు టీ20లను ఇండియా గెలిచింది.