commonwealth games 2022: మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్
కామన్వెల్త్ మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత్ జట్టు శుభారంభం చేసింది. స్టార్ ప్లేయర్లు పీవీ సింధు,కిదాంబి శ్రీకాంత్‌తో పాటు డబుల్స్ ఆటగాళ్లు రాణించడంతో తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను 5-0 తేడాతో భారత జట్టు ఓడించింది.
కామన్వెల్త్ గేమ్స్ లో తొలి రోజు మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో పాకిస్థాన్ ను భారత్ 5-0 తేడాతో ఓడించింది. గ్రూప్ ఏలో భాగంగా జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ల్ సింధు, శ్రీకాంత్ సింగిల్స్ లో రాణించడంతో భారత్ పై చేయి సాధించింది.తొలి మ్యాచ్ లో డబుల్ ప్లేయర్స్ అశ్వినీ పొన్నప్ప, సుమిత్ రెడ్డి 21-9 21-12 తేడాతో విజయాన్ని సాధించి ఇండియాకు 1-0 ఆధిక్యాన్ని అందించారు.
ఆ తర్వాత కిదాంబి శ్రీకాంత్ 21-7 21-12 తేడాతో మురాద్ అలీని ఓడించాడు. మూడో మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ సింధు దూకుడైన ఆటతో మహూర్ షెహజాద్ ను బెంబేలేత్తించింది. 21-7 21-6 తేడాతో మహూర్ పై సింధు విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు డబుల్స్ మ్యాచ్ లలో రకిరెడ్డి శెట్టి, త్రిష జాలీ, గాయత్రి గోపిచంద్ జోడి విజయాల్ని అందుకోవడంలో 5-0 తేడాతో పాకిస్థాన్ ను క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో తదుపరి మ్యాచ్ లలో శ్రీలంక, ఆస్ట్రేలియాలతో భారత జట్టు తలపడనున్నది.