India vs Australia 1st Test: తొలి టెస్టులో భారత్ ఆలౌట్.. మెరుగైన ఆధిక్యంలో రోహిత్ సేన
India vs Australia 1st Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 400 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 84 పరుగుల వద్ద ఔట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
India vs Australia 1st Test: నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌటైంది. మూడో రోజు లంచ్ విరామం వరకు బ్యాటింగ్ చేసిన టీమిండియా 400 పరుగుల వద్ద ఆలౌటైంది. రోహిత్ శర్మ(120) సెంచరీతో విజృంభించగా.. అక్షర్ పటేల్(84), రవీంద్ర జడేజా(70) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు టాడ్ మర్ఫీ 7 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
321/7 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ప్రారంభంలోనే జడేజా వికెట్ పారేసుకుంది. కంగారూ బౌలర్లలో అదిరిపోయే ప్రదర్శన చేసిన మర్ఫీనే జడ్డూను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ సాయంతో అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. షమీ వేగంగా ఆడగా.. అక్షర్ ఆచితూచి నిలకడగా ఆడాడు.
ఆస్ట్రేలియా బౌలర్లపై షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అక్షర్ సాయంతో ఆధిక్యాన్ని 200 పరుగులను అధిగమించేలా చేశాడు. వీరిద్దరూ 8వ వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో షమీని మర్ఫీ ఔట్ చేశాడు. షమీ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్ ఎక్కువ సేపు నిలువలేదు. అక్షర్ పటేల్ సెంచరీ కోసం ప్రయత్నిస్తూ నిలకడగా ఆడాడు. సెంచరీ చేస్తాడేమో అనుకున్న తరుణంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 400 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకే కుప్పుకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ, సిరాజ్ చెరో వికెట్‌తో ఆదిలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు పూర్తయ్యే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(120) శతకంతో ఆకట్టుకున్నాడు.
సంబంధిత కథనం