INDvs WI 3rd Odi: మూడో వన్డేకు వర్షం అడ్డంకి? - ప్రయోగాలకు టీమ్ ఇండియా పుల్‌స్టాప్?
INDvs WI 3rd Odi: ఇండియా, వెస్టిండీస్ మధ్య మంగళవారం (ఆగస్ట్ 1న) నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ వన్డే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
INDvs WI 3rd Odi: మంగళవారం ఇండియా వెస్టిండీస్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా, వెస్టిండీస్ తలో గెలుపుతో సమంగా ఉన్నాయి. మూడో వన్డేలో విజయాన్ని సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఇరు జట్లు బరిలోకి దిగుతోన్నాయి.
మూడో వన్డేకు వర్షం ముప్పు
ట్రినిడాడ్ వేదికగా జరుగనున్న మూడో వన్డేకు వర్షం ముప్పు పొంచినట్లు సమాచారం. ట్రినిడాడ్‌లో మంగళవారం మొత్తం మబ్బులు కమ్ముకున్నట్లు తెలిసింది. వర్షం పడే అవకాశం 55 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రయోగాలు బంద్?
రెండో వన్డేలో బ్యాటింగ్ పరంగా ప్రయోగాలు చేయడం టీమ్ ఇండియాను దెబ్బకొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చారు. యంగ్ ప్లేయర్స్ పూర్తిగా విఫలం కావడంతో టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వన్డే సిరీస్ గెలుపుకు కీలకమైన మూడో వన్డేలో ప్రయోగాల జోలికి వెళ్లకూడదని టీమ్ ఇండియా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మూడో వన్డేలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఆడనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం టీమ్ ఇండియాను కలవరపెడుతోంది. హార్దిక్ పాండ్య, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ రెండు వన్డేల్లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు.
ఆసియా కప్, వరల్డ్ కప్ దృష్ట్యా వారు ఫామ్‌లోకి రావడం కీలకంగా మారింది. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ రెండో వన్డేల్లో రాణించాడు. అతడితోపాటు కైల్ మేయర్స్ హెట్‌మేయర్, కార్టీ రాణిస్తే ఇండియాకు కష్టాలు తప్పవు.