IND vs AUS test in Hyderabad: గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌!-ind vs aus test likely in hyderabad next year ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Aus Test In Hyderabad: గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌!

IND vs AUS test in Hyderabad: గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌!

Hari Prasad S HT Telugu
Nov 17, 2022 09:49 AM IST

IND vs AUS test in Hyderabad: గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇండియాలో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటించనుంది.

ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ట్రైనింగ్ (ఫైల్)
ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ట్రైనింగ్ (ఫైల్) (AP)

IND vs AUS test in Hyderabad: హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన భాగ్యనగరం.. వచ్చే ఏడాది ఈ రెండు టీమ్స్‌ మధ్య టెస్ట్‌కు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రొటేషన్‌ పద్ధతిలో మ్యాచ్‌లను కేటాయించే బీసీసీఐ.. ఈసారి ఆస్ట్రేలియా సిరీస్‌లో హైదరాబాద్‌కు ఛాన్స్‌ ఇవ్వనుంది.

అయితే పోటీలో చెన్నై కూడా ఉంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌ లేదా చెన్నైలలో జరిగే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. సౌతిండియాలో బెంగళూరు ఇప్పటికే ఇండియా, శ్రీలంక మధ్య ఏడాది మొదట్లో టెస్ట్‌ ఛాన్స్‌ కొట్టేసింది. అక్కడ ఈ రెండు టీమ్స్ ఓ డేనైట్‌ టెస్ట్‌లో తలపడిన విషయం తెలిసిందే.

దీంతో ఇప్పుడు మిగిలిన హైదరాబాద్‌, చెన్నైలలో ఒకరికి ఆస్ట్రేలియా టెస్ట్‌ నిర్వహించే అవకాశం దక్కనుంది. ఎక్కువ శాతం అవకాశాలు హైదరాబాద్‌కే ఉన్నట్లు కూడా బోర్డు అధికారి తెలిపారు. అయితే దీనిపై ఇంకా బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ, అహ్మదాబాద్‌, ధర్మశాలల్లో మిగతా మూడు టెస్ట్‌లు జరిగే ఛాన్స్‌ ఉంది.

ఢిల్లీలో ఐదేళ్ల తర్వాత ఓ టెస్ట్‌ జరగనుంది. 2017లో చివరిసారి శ్రీలంకతో టెస్ట్‌ మ్యాచ్‌ నిర్వహించిన తర్వాత ఢిల్లీకి మరో అవకాశం దక్కలేదు. దీంతో ఈసారి బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలోని నాలుగు టెస్టుల్లో రెండో మ్యాచ్‌ ఇక్కడ నిర్వహించే అవకాశం ఉంది. ధర్మశాలలో మూడో టెస్ట్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్ట్‌ జరుగుతుంది.

ఇండియాకు కూడా ఈ సిరీస్‌ కీలకం కానుంది. 2021-23 టెస్ట్‌ సైకిల్‌లో ఇండియాకు ఇదే చివరి సిరీస్‌. దీంతో అది కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి టీమిండియాపై ఉంటుంది. చాలా రోజులుగా ఢిల్లీకి అవకాశం రాకపోవడంతో ఈసారి అక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు.

కొవిడ్‌ తర్వాత బీసీసీఐ ఇప్పటి వరకూ 8 టెస్టులు నిర్వహించింది. 2021లో చెన్నై, అహ్మదాబాద్‌లలో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు, న్యూజిలాండ్‌తో కాన్పూర్‌, ముంబైలలో రెండు టెస్టులు, శ్రీలంకతో చండీగఢ్‌, బెంగళూరులలో రెండు టెస్టులు నిర్వహించారు.

Whats_app_banner