PV Sindhu: సింగిల్స్‌లో కచ్చితంగా గోల్డ్ మెడల్ గెలుస్తా: పీవీ సింధు
PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. అయితే టీమ్ ఈవెంట్‌లో సాధ్యం కాకపోయినా సింగిల్స్‌లో మాత్రం గోల్డ్ తెస్తానంటోంది స్టార్ షట్లర్ పీవీ సింధు.
బర్మింగ్‌హామ్: బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్‌పై ఎన్నో ఆశలు రేపిన ఇండియన్ టీమ్.. చివరికి సిల్వర్‌కే పరిమితమైంది. ఫైనల్లో మలేసియా చేతుల్లో 1-3 తేడాతో ఓడిపోయింది. ఇండియా తరఫున పీవీ సింధు మాత్రమే గెలవగా.. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి, వుమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జోలీ, గాయత్రి, మెన్స్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఓడిపోవడంతో ఇండియా గోల్డ్ గెలిచే అవకాశం కోల్పోయింది.
టీమ్ ఈవెంట్ ముగిసిపోయిందని, ఇక తన ఫోకస్ వ్యక్తిగత ఈవెంట్‌లపై అని సింధు చెబుతోంది. "వ్యక్తిగత ఈవెంట్‌లలో బెస్ట్ కోసం ఆశిస్తున్నాను. గోల్డ్ గెలుస్తానని అనుకుంటున్న. టీమ్ ఈవెంట్ ముగియడంతో ఇక ఎవరి వ్యక్తిగత ఈవెంట్లపై వాళ్లు దృష్టిసారిస్తారు. మరోసారి ప్లాన్ చేసుకొని మరింత మెరుగ్గా ఆడాల్సిన సమయం ఇది. ఏది ఏమైనా ప్లేయర్స్ తమ 100 శాతం ప్రదర్శన ఇవ్వడం ముఖ్యం" అని పీవీ సింధు అభిప్రాయపడింది.
టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ రాకపోవడం కాస్త బాధ కలిగించిందని చెప్పింది. అయితే సిల్వర్ గెలిచినందుకు కూడా సంతోషంగానే ఉన్నదని స్పష్టం చేసింది. ఇక టీమ్ ఈవెంట్‌లో తన మ్యాచ్ చూడటానికి ఇండియన్ వుమెన్స్ క్రికెట్ రావడంపై కూడా సింధు స్పందించింది. వాళ్లు నేరుగా మ్యాచ్ చూడటం తనలో ఉత్సాహం నింపిందని చెప్పింది.
"వాళ్లు నన్ను ఎంకరేజ్ చేయడం నాకు వినిపించింది. ఇది నాలో ఎంతో ఉత్సాహం నింపింది. వాళ్లను ఇక్కడ చూడటం సంతోషంగా ఉంది. వాళ్ల మ్యాచ్‌లకు కూడా ఆల్‌ద బెస్ట్. మమ్మల్ని కలవడం సంతోషంగా ఉందని వాళ్ల కోచ్ చెప్పాడు. వాళ్లను మేము కలవడం కూడా మాకు సంతోషంగా ఉంది" అని సింధు చెప్పింది.