Ind vs SA: పంత్.. కార్తీక్ కంటే ముందు అక్షర్‌ను పంపడమేంటి?: గవాస్కర్
సౌతాఫ్రికా చేతిలో వరుసగా రెండో ఓటమితో రిషబ్ పంత్ కెప్టెన్సీపై వేలెత్తి చూపేవారి సంఖ్య ఎక్కువవుతోంది. గవాస్కర్‌లాంటి మాజీ క్రికెటర్లు అతడు తీసుకున్న నిర్ణయాలపై తీవ్రంగా మండిపడుతున్నారు.
కటక్: అనుకోకుండా వచ్చిన టీమిండియా కెప్టెన్సీని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎక్కువ కాలం నిలబెట్టుకునేలా కనిపించడం లేదు. ఫీల్డ్‌లో అతడు తీసుకున్న నిర్ణయాల కారణంగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో చహల్‌కు పూర్తి కోటా ఓవర్లు ఇవ్వకపోవడం, రెండో మ్యాచ్‌లో కార్తీక్ కంటే ముందు అక్షర్ పటేల్‌ను పంపించడం వంటి నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి.
రెండో టీ20లో పంత్ చేసిన తప్పిదంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. కార్తీక్‌పై ఫినిషర్ అన్న ముద్ర ఉన్నందుకు అతన్ని చివర్లోనే పంపాలా అని ప్రశ్నించాడు. అతన్ని కాస్త ముందు పంపిస్తే పిచ్ పరిస్థితులు తెలుసుకొని మరింత మెరుగ్గా ఆడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అక్షర్‌ను ముందు పంపాలన్న నిర్ణయం కారణంగా టీమిండియా కేవలం 148 పరుగులకే పరిమితమైంది. అక్షర్ 9 రన్స్ చేసి ఔటయ్యాడు. చివర్లో వచ్చిన కార్తీక్ 21 బాల్స్‌లో 30 రన్స్ చేసి తనదైన స్టైల్లో ఇన్నింగ్స్ ముగించాడు.
"ఫినిషర్ అనే ట్యాగ్ వల్ల అలాంటి వాళ్లు కేవలం 15వ ఓవర్ తర్వాతే రావాలన్నట్లుగా భావిస్తుంటారు. అతడు 12 లేదా 13వ ఓవర్లో రాకూడదు అనుకుంటారు. ఐపీఎల్‌లోనూ ఇలాగే జరిగింది. చాలా టీమ్స్ తమ ప్రధాన బ్యాటర్లను చివరి 4, 5 ఓవర్ల కోసం దాచుకున్నారు. వాళ్లను ముందు పంపడం వల్ల తొలి బంతి నుంచే వాళ్లు సిక్స్‌లు కొట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల వాళ్లు వికెట్‌ను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకు తగినట్లు చివరి ఓవర్లలో ఆడతారు" అని మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ డిస్కషన్‌లో గవాస్కర్ అన్నాడు.
ఇందులో పాల్గొన్న సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. "నాకు అర్థం కాలేదు. ఇండియాలో కార్తీక్ అనుభవజ్ఞులైన క్రికెటర్లలో ఒకడు. అలాంటి వ్యక్తిని కాదని అక్షర్‌ను ముందుగా ఎలా పంపిస్తారు. ఇది దిమ్మదిరిగిపోయే నిర్ణయం" అని అనడం గమనార్హం. అటు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"దినేష్ కార్తీక్‌ను చివరి మూడు ఓవర్లకే పరిమితం చేయొద్దని దీనిని బట్టి తెలుస్తోంది. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉండి ఆరో నంబర్‌లో దిగుతున్నప్పుడు కఠినమైన పరిస్థితుల్లో ఆడటం ఆ బ్యాటర్ కర్తవ్యం. చివరి మూడు ఓవర్లలో నష్టాన్ని పూడ్చడం వాళ్ల పని" అని గంభీర్ అన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్