Gambhir Shocking Comments: పాంటింగ్‌ కంటే రోహిత్‌ మంచి బ్యాటర్‌: గంభీర్‌ కామెంట్స్‌తో షాక్‌ తిన్న మంజ్రేకర్‌-gambhir shocking comments says rohit sharma is better batter than ricky ponting ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gambhir Shocking Comments: పాంటింగ్‌ కంటే రోహిత్‌ మంచి బ్యాటర్‌: గంభీర్‌ కామెంట్స్‌తో షాక్‌ తిన్న మంజ్రేకర్‌

Gambhir Shocking Comments: పాంటింగ్‌ కంటే రోహిత్‌ మంచి బ్యాటర్‌: గంభీర్‌ కామెంట్స్‌తో షాక్‌ తిన్న మంజ్రేకర్‌

Hari Prasad S HT Telugu
Jan 12, 2023 03:02 PM IST

Gambhir Shocking Comments: పాంటింగ్‌ కంటే రోహిత్‌ మంచి బ్యాటర్‌ అని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ చేసిన కామెంట్స్‌తో స్టూడియోలోనే ఉన్న మరో మాజీ సంజయ్‌ మంజ్రేకర్‌ షాక్‌ తిన్నాడు. శ్రీలంకతో ఇండియా రెండో వన్డేకు ముందు గంభీర్‌, మంజ్రేకర్‌ మధ్య ఆసక్తికర చర్చ నడిచింది.

గౌతమ్ గంభీర్, రికీ పాంటింగ్
గౌతమ్ గంభీర్, రికీ పాంటింగ్

Gambhir Shocking Comments: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం అత్యుత్తమ వైట్‌ బాల్‌ క్రికెటర్లలో ఒకడు. ముఖ్యంగా వన్డేల్లో అతని రికార్డులకు తిరుగు లేదు. తన కెరీర్‌లో తొలి ఆరేళ్ల పాటు కేవలం రెండే సెంచరీలు చేసిన రోహిత్.. 2013లో అనుకోకుండా తనకు వచ్చిన ఓపెనర్‌ ఛాన్స్‌ను ఒడిసి పట్టుకొని పరుగుల వరద పారించాడు.

అప్పటి నుంచి అతని కెరీర్‌ మలుపు తిరిగింది. 2017 నుంచి 2020 మధ్య వన్డేల్లో రోహిత్‌ ఏకంగా 19 సెంచరీలు బాదాడు. ఇక ఇంత వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం 237 వన్డేల్లో అతడు 49 సగటుతో 9537 రన్స్‌ చేశాడు. 29 సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్‌ లెజెండరీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ కంటే ఒక్క సెంచరీ దూరంలోనే రోహిత్‌ ఉన్నాడు.

2020, జనవరిలో చివరిసారి వన్డేల్లో సెంచరీ చేసిన రోహిత్‌.. మూడేళ్లుగా పాంటింగ్ రికార్డును సమం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ రికార్డు రోహిత్‌ను పాంటింగ్‌ కంటే మంచి బ్యాటర్‌ను చేస్తుందా? టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అవుననే అంటున్నాడు. శ్రీలంకతో రెండో వన్డే ప్రారంభానికి ముందు స్టార్‌ స్పోర్ట్స్‌లో సంజయ్‌ మంజ్రేకర్‌తో కలిసి మాట్లాడిన గంభీర్‌.. పాంటింగ్‌ కంటే రోహిత్‌ మంచి బ్యాటర్‌ అనడం విశేషం.

"ఆశ్చర్యకర విషయం ఏమిటంటే గత నాలుగు లేదా ఐదేళ్లలోనే రోహిత్‌ చాలా సెంచరీలు చేశాడు. అంతకు ముందు ఆరేడేళ్లు అతడు అంత నిలకడగా ఆడలేదు. గత ఐదు నుంచి ఏడేళ్లలోనే రోహిత్‌ 20 సెంచరీల వరకూ సాధించాడు" అని గంభీర్ అన్నాడు. గంభీర్‌ చెప్పింది నిజమే. 2017-2020 మధ్య టాప్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ వన్డేల్లో ఏకంగా 19 సెంచరీలు బాదాడు. అయితే ఆ తర్వాత మరో సెంచరీ చేయలేకపోయాడు.

అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ పాంటింగ్‌ కంటే రోహిత్‌ మంచి బ్యాటర్‌ అని గంభీర్‌ అనడమే మంజ్రేకర్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. "నువ్వు గంభీర్‌ చెప్పింది మిస్‌ అయ్యావు" అంటూ యాంకర్‌తో మంజ్రేకర్‌ అన్నాడు. అప్పుడు గంభీర్‌ మరోసారి కలగజేసుకొని.. "రోహిత్‌ కచ్చితంగా రికీ పాంటింగ్‌ కంటే బెటర్‌ ప్లేయర్‌. ఉపఖండంలో రికీ సగటు చెత్తగా ఉంది" అని చెప్పాడు.

నిజానికి పాంటింగ్‌ సగటు ఉపఖండంలో మరీ అంత దారుణంగా ఏమీ లేదు. ఇండియా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలలో పాంటింగ్‌ వన్డేల్లో 41 సగటుతో రన్స్‌ చేశాడు. అయితే తన మొత్తం 30 వన్డే సెంచరీల్లో కేవలం ఆరు మాత్రమే ఉపఖండంలో సాధించాడు. రోహిత్‌ గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి. అతడు ఉపఖండం బయట కూడా 13 సెంచరీలు చేయడం విశేషం. అంతేకాదు బయట అతడు ఏకంగా 47 సగటుతో పరుగులు చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్