France vs Argentina Fifa Final: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ - అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ బలాబలాలు, రికార్డ్‌లు ఇవే
France vs Argentina Fifa Final: ఫిఫా వరల్డ్ కప్ 2022 సమరం తుది దశకు చేరుకున్నది. ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ ఫైట్ జరుగనుంది. ఇరు జట్ల బలాబలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే...
France vs Argentina Fifa Final: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగనుంది. కప్పు గెలిచేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. జాతీయ జట్టు తరఫున అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీకి ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఫుట్‌బాల్ ప్రేమికుల్లో రిజల్ట్‌పై ఆసక్తి ఏర్పడింది. మరోవైపు ఎంబాపే, గెరార్డ్, గ్రీజ్‌మన్ వంటి స్టార్స్‌తో ఫ్రాన్స్ బలంగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగనున్న ఫ్రాన్స్ మరోసారి టైటిల్‌ను గెలవాలనే సంకల్పంతో బరిలో దిగుతోంది.
అర్జెంటీనాదే ఆధిపత్యం
ఫైనల్‌కు ముందు అర్జెంటీనా, ఫ్రాన్స్ 12 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆరుసార్లు అర్జెంటీనా విజయాన్ని సాధించగా ఫ్రాన్స్ మూడు సార్లు మాత్రమే గెలిచింది. మరో మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వరల్డ్ కప్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో రెండుసార్లు అర్జెంటీనా విజయాన్ని సాధించగా ఒక్కసారి ఫ్రాన్స్ గెలిచింది. చివరగా ఈ రెండు సార్లు 2018 వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌లో 4-3 తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకున్నది.
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయాన్ని సాధిస్తే మూడుకంటే ఎక్కువగా సార్లు వరల్డ్ కప్ గెలిచిన నాలుగో జట్టుగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అత్యధికంగా బ్రెజిల్ ఐదు సార్లు వరల్డ్ కప్ అందుకున్నది. జర్మనీ, ఇటలీ తలో నాలుగుసార్లు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నాయి.
ఒకవేళ ఫ్రాన్స్ గెలిస్తే డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరల్డ్ కప్ గెలిచిన మూడో టీమ్‌గా నిలుస్తుంది. గతంలో ఇటలీ (1934, 38), ఆ తర్వాత బ్రెజిల్ (1958, 1962) మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకున్నాయి.
ఇప్పటికే గోల్డెన్ బూట్ రేసులో ఉన్న మెస్సీ ఈ ఫైనల్ మ్యాచ్ ద్వారా మరో రెండు రికార్డ్‌లపై కన్నేశాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలవనున్నాడు. ప్రస్తుతం ఇరవై ఐదు మ్యాచ్‌లతో జర్మనీ ఫుట్‌బాల్ ప్లేయర్ లోతన్ మథాస్, మెస్సీ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను మెస్సీ అందుకున్నాడు. ఫైనల్‌లో గెలిస్తే ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆటగాడిగా మెస్సీ నిలుస్తాడు.