FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. కారణం తెలిస్తే షాకవుతారు!
FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టోర్నీ మొదలైన తొలి 8 రోజులు రోజుకు నాలుగు మ్యాచ్‌లు జరిగినా ఒక్కో మ్యాచ్ ఒక్కో టైమ్‌కు ఉండేది. కానీ ఇప్పుడిలా ఎందుకు? దీని వెనుక కారణం తెలిస్తే షాకవుతారు!
FIFA World Cup 2022: ప్రపంచం మొత్తాన్నీ ఫిఫా వరల్డ్‌కప్ ఊపేస్తోంది. లీగ్ స్టేజ్‌లో రోజుకు నాలుగు మ్యాచ్‌లతో ఉర్రూతలూగిస్తోంది. మధ్యమధ్యలో కొన్ని సంచలనాలు నమోదవుతున్నా.. నాకౌట్ స్టేజ్ దగ్గర పడిన కొద్దీ ప్రతి మ్యాచ్ థ్రిల్లింగ్ క్లైమ్యాక్స్‌ను తలపిస్తోంది. తొలి 8 రోజులు రోజుకు నాలుగేసి మ్యాచ్‌లు జరిగాయి. ఆ మ్యాచ్‌లన్నీ ఒక్కొక్కటి ఒక్కో టైమ్‌కు ప్రారంభమయ్యాయి.
మన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30, సాయంత్రం 6.30, రాత్రి 9.30, అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభమయ్యేవి. దీంతో అన్ని మ్యాచ్‌లను చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. అయితే గత మంగళవారం (నవంబర్ 29) నుంచి ఫిఫా వరల్డ్‌కప్‌లో రోజూ నాలుగు మ్యాచ్‌లు జరుగుతున్నా.. ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
రాత్రి 8.30 గంటలకు రెండు మ్యాచ్‌లు, అర్ధరాత్రి 12.30 గంటలకు మరో రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకే గ్రూప్‌కు చెందిన రెండు మ్యాచ్‌లు ఒకేసారి జరుగుతున్నాయి. ఇది సమయం లేక కాదు. దీని వెనుక బలమైన కారణమే ఉంది.
ఒకే సమయానికి మ్యాచ్‌ల వెనుక ఇదీ కారణం
గురువారం (డిసెంబర్ 1) కూడా గ్రూప్ ఎఫ్‌లో క్రొయేషియా, బెల్జియం.. కెనడా, మొరక్కో మ్యాచ్‌లు మన టైమ్ ప్రకారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇక గ్రూప్ ఇలో జర్మనీ, కోస్టారికా.. జపాన్, స్పెయిన్ మ్యాచ్‌లు అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలవుతాయి. దీని వెనుక కారణమేంటంటే.. ఒక మ్యాచ్ ఫలితం మరో మ్యాచ్‌పై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపకుండా ఉండేందుకే.
నాకౌట్ స్టేజ్ దగ్గర పడుతున్న సమయంలో ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే అయి ఉంటుంది. ఒక టీమ్ తర్వాతి రౌండ్‌కు వెళ్లేది లేనిది మరో మ్యాచ్‌పై ఆధారపడే అవకాశాలూ ఉంటాయి. అలాంటి సమయాల్లో ఆయా టీమ్స్ కావాలని మ్యాచ్ ఫలితాలు తారుమారు చేయడం కుదరకపోగా.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా అవకాశం ఉండదు. మరో మ్యాచ్ ఫలితం చూసి ఫీల్డ్‌లో అడుగుపెట్టే అవకాశం మిగతా రెండు టీమ్స్‌కు ఉండదు. దీంతో పూర్తిగా న్యాయమైన ఆట ఆడే అవకాశం ప్లేయర్స్‌కు, చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కుతుంది.
40 ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనతో..
ఈ నిర్ణయం తీసుకోవడానికి 40 ఏళ్ల కిందట జరిగిన ఓ ఘటనే కారణం. 1982 వరల్డ్‌కప్‌లో వెస్ట్ జర్మనీ, ఆస్ట్రియా టీమ్స్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో వెస్ట్ జర్మనీ ఒకటి లేదా రెండు గోల్స్ తేడాతో గెలిస్తే ఈ రెండు టీమ్స్ తర్వాతి రౌండ్‌కు చేరతాయని తేలింది. అంతకుముందు రోజే అల్జీరియా మ్యాచ్‌లు ముగియడంతో ఆ టీమ్ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసింది.
అయితే వెస్ట్ జర్మనీ, ఆస్ట్రియా టీమ్స్ ప్లాన్ చేసుకొని అల్జీరియాను ఇంటిదారి పట్టించాయి. మ్యాచ్ 11 వ నిమిషంలో వెస్ట్ జర్మనీ ఒక గోల్ చేసింది. ఇక ఆ తర్వాత రెండు జట్లూ ఫీల్డ్‌లో కావాలని చాలా నీరసంగా కదిలాయి. రెండు టీమ్స్ గోల్ చేయడానికి ప్రయత్నించలేదు. వెస్ట్ జర్మనీ ప్లేయర్స్ అయితే బాల్‌ను ముందుకు తీసుకెళ్లడం కంటే వెనక్కే ఎక్కువగా తీసుకెళ్లారని అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. మ్యాచ్‌లో వెస్ట్ జర్మనీ 1-0తో గెలవడంతో ఆ రెండు టీమ్స్ తర్వాతి రౌండ్‌కు వెళ్లాయి.
ఈ మ్యాచ్‌పై అల్జీరియా ఫిఫాకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. అయితే తర్వాత వరల్డ్‌కప్ నుంచి రూల్స్ మార్చింది. గ్రూప్ స్టేజ్‌లో అన్ని చివరి మ్యాచ్‌లు ఒకే సమయానికి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. 1986 వరల్డ్‌కప్ నుంచి ఇదే జరుగుతూ వస్తోంది.