IPL Auction | ఐపీఎల్‌ వేలం నిర్వహించే ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా?-do you know about hugh edmeades who auctions players in ipl auction ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Auction | ఐపీఎల్‌ వేలం నిర్వహించే ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా?

IPL Auction | ఐపీఎల్‌ వేలం నిర్వహించే ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా?

Hari Prasad S HT Telugu
Feb 09, 2022 01:02 PM IST

ఐపీఎల్‌ మెగా వేలంలో ఏ ప్లేయర్‌కు ఎంతకు అమ్ముడవుతాడు? ఏ టీమ్‌ ఎవరిని తీసుకుంటుంది? ఎవరు అత్యధిక ధరకు అమ్ముడవుతారు? వంటి చర్చలు సహజమే. అయితే అసలు ఈ ఐపీఎల్‌ వేలం వేసే హ్యూ ఎడ్మీడస్‌ ఎవరు? ఆయన గొప్పతనమేంటో మీకు తెలుసా?

<p>ఐపీఎల్ వేలం నిర్వహించే హ్యూ ఎడ్మీడస్</p>
ఐపీఎల్ వేలం నిర్వహించే హ్యూ ఎడ్మీడస్ (Twitter)

బెంగళూరు: IPL Auction.. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఈసారి మెగా వేలం జరగబోతోంది. 2008లో తొలిసారి మొదలైన ఈ ప్లేయర్స్‌ వేలాన్ని మూడేళ్లుగా బ్రిటన్‌కు చెందిన హ్యూ ఎడ్మీడస్‌ నిర్వహిస్తున్నారు. అంతకుముందు మరో ప్రముఖ ఆక్షనీర్‌ రిచర్డ్‌ మ్యాడ్లీ ఐపీఎల్‌ వేలం నిర్వహించేవారు. 

2018 నుంచి ఆయనను పక్కన పెట్టిన ఎడ్మీడస్‌ను తీసుకొచ్చారు. ఈసారి మెగా వేలంలో 590 మంది ప్లేయర్స్‌ను వేలం వేసే బాధ్యత ఈయనపై ఉంది. శనివారం, ఆదివారం బెంగళూరులో జరగబోతున్న ఈ మెగా వేలాన్ని సజావుగా, ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహించడం అంత సులువైన విషయం కాదు. మరి దీనికి ఆయన ఎలా సిద్ధమవుతున్నారు? అసలు ఈ ఎడ్మీడస్‌కు వేలంలో ఉన్న అనుభవం ఎంత?

ఎవరీ ఎడ్మీడస్‌?

హ్యూ ఎడ్మీడస్‌ బ్రిటన్‌కు చెందిన వ్యక్తి. వేలం పాటలు నిర్వహించడంలో దిట్ట. ఏకంగా 36 ఏళ్ల అనుభవం ఈయన సొంతం. తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 2500కుపైగా ఆక్షన్లు నిర్వహించారు. ఫైన్‌ ఆర్ట్స్‌, క్లాసిక్‌ కార్లు, చారిటీ వస్తువుల వేలం పాటలను ఎడ్మీడస్‌ నిర్వహిస్తుంటారు. 

ఇప్పటి వరకూ ఈయన సుమారు 2700 కోట్ల పౌండ్ల విలువైన వస్తువులను వేలం వేశారంటే నమ్మశక్యం కాదు. ఐపీఎల్‌లో ప్లేయర్స్‌ను వేలం వేస్తున్నారుగానీ.. నిజానికి ఈయన పెయింటింగులు, సెరామిక్స్‌, సినిమా, స్పోర్ట్స్‌కు సంబంధించిన విలువైన వస్తువులు, ఫర్నీచర్‌ వంటివి వేలం వేస్తారు. 

2004లో ఎరిక్‌ క్లాప్టన్‌కు చెందిన 88 గిటార్లను వేలం వేసి ఏకంగా 73.43 లక్షల డాలర్లు సమకూర్చారు. జేమ్స్‌ బాండ్‌ స్పెక్టర్‌ మూవీలో డేనియల్‌ క్రెయిగ్‌ వాడిన ఆస్టన్‌ మార్టిన్‌ కారును కూడా 2016లో 24.34 లక్షల పౌండ్లకు అమ్మి పెట్టారు. ఇప్పుడు మూడేళ్లుగా ఐపీఎల్‌లో ప్లేయర్స్‌ వేలాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం