IPL 2022 RCB vs RR | చెలరేగిన కార్తీక్‌, షాబాజ్.. రాయల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ-dinesh karthik and shahbaz help rcb beat rr in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 Rcb Vs Rr | చెలరేగిన కార్తీక్‌, షాబాజ్.. రాయల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ

IPL 2022 RCB vs RR | చెలరేగిన కార్తీక్‌, షాబాజ్.. రాయల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ

Hari Prasad S HT Telugu
Apr 05, 2022 11:30 PM IST

రాయల్స్‌ను చిత్తు చేశారు రాయల్‌ ఛాలెంజర్స్‌. హ్యాట్రిక్‌ విజయాలపై కన్నేసిన రాజస్థాన్‌కు బెంగళూరు షాకిచ్చింది. ట్విస్ట్‌లతో సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఆర్సీబీ పైచేయి సాధించింది.

<p>ఆర్సీబీకి విజయం సాధించిపెట్టిన షాబాజ్, కార్తీక్ జోడీ</p>
ఆర్సీబీకి విజయం సాధించిపెట్టిన షాబాజ్, కార్తీక్ జోడీ (ANI)

ముంబై: ఐపీఎల్‌ 2022లో రాజస్థాన్‌ రాయల్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న రాజస్థాన్‌ రాయల్స్‌ను ఆర్సీబీ ఓడించింది. దినేష్‌ కార్తీక్‌, షాబాజ్‌ చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరో వికెట్‌కు కార్తీక్‌, షాబాజ్‌ కలిసి 32 బంతుల్లోనే 67 పరుగులు జోడించారు. షాబాజ్‌ కేవలం 26 బంతుల్లో 45 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. కార్తీక్‌ 23 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 14, 15, 16 ఓవర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. ఈ మూడు ఓవర్లలోనే దినేష్‌ కార్తీక్‌, షాబాజ్‌ జోడీ ఏకంగా 50 పరుగులు పిండుకున్నారు. అశ్విన్‌ వేసిన 14వ ఓవర్లో కార్తీక్‌ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. ఆ తర్వాత సైనీ ఓవర్లో కార్తీక్‌ రెండు, షాబాజ్‌ ఒక బౌండరీ కొట్టారు. ఇక ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 16వ ఓవర్లో షాబాజ్ ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ కొట్టాడు.

నిజానికి ఆర్సీబీ చేజింగ్ ట్విస్టులతో సాగింది. ఒక దశలో 55 పరుగులకు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా పటిష్ట స్థితిలో కనిపించింది. అయితే స్పిన్నర్‌ చహల్‌ వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి సడెన్‌గా 62 పరుగులకు 4 వికెట్లతో కష్టాల్లో పడింది. ఈ దశలో ఐదో వికెట్‌కు రూథర్‌ఫర్డ్‌ (5)తో కలిసి 25 పరుగులు, ఆరో వికెట్‌కు కార్తీక్‌తో కలిసి 67 పరుగులు జోడించి ఆర్సీబీని గట్టెక్కించాడు షాబాజ్‌. 18వ ఓవర్ ఐదో బంతికి బౌల్ట్‌ బౌలింగ్‌లో షాబాజ్‌ ఔటైనా.. మిగిలిన పనిని దినేష్‌ కార్తీక్‌ పూర్తి చేశాడు.

బట్లర్ సూపర్ ఇన్నింగ్స్

అంతకుముందు బట్లర్‌ 47 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు సిక్స్‌లు ఉన్నా.. ఒక్క బౌండరీ కూడా లేకపోవడం విశేషం. అతనికి హెట్‌మయర్‌ కూడా (31 బంతుల్లో 42) మంచి సహకారం ఇవ్వడంతో రాయల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 రన్స్‌ చేసింది. ఈ ఇద్దరూ చివరి రెండు ఓవర్లలోనే ఏకంగా 42 పరుగులు రాబట్టడం విశేషం. ఒక దశలో ఆర్సీబీ బౌలర్లు రాయల్స్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. 18 ఓవర్లలో 3 వికెట్లకు 127 పరుగులే చేసింది. కానీ చివరి రెండు ఓవర్లే ఇన్నింగ్స్‌ను మొత్తం మార్చేశాయి. బట్లర్ 11 పరుగుల దగ్గర ఉన్నప్పుడు బౌండరీ దగ్గర విల్లీ క్యాచ్ డ్రాప్ చేయడం ఆర్సీబీ కొంప ముంచింది.

ఆర్సీబీ తరఫున స్టార్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. డేవిడ్‌ విల్లీ కూడా 4 ఓవర్లలో 29 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీసుకోగా.. స్పిన్నర్‌ హసరంగ 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ సొంతం చేసుకున్నాడు. మరోవైపు సిరాజ్‌ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలోనే ఏకంగా 43 పరుగులు ఇవ్వడం గమనార్హం. అతడు తన చివరి ఓవర్లోనే 19 రన్స్‌ ఇచ్చాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌ (4), సంజు శాంసన్‌ (8) విఫలమయ్యారు. మరో బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ 29 బంతుల్లో 37 రన్స్‌ చేసి ఫర్వాలేదనిపించాడు.

Whats_app_banner

టాపిక్