IPL Auction 2022 | మేనేజ్ మెంట్ కోటా ప్లేయర్... సచిన్ తనయుడిపైవిమర్శలు
ఐపీఎల్ వేలంలో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ముంబయి ఇండియన్స్ 30 లక్షలకు కొనుగోలు చేసింది. గత ఏడాది అతడిని 20 లక్షలకే కొన్న ముంబయి ఈ సారి మరో 10 లక్షలు పెంచి అతడిని జట్టులోకి తీసుకున్నది. వేలంలో అర్జున్ టెండూల్కర్ ను కొనడానికి ముంబయి ఇండియన్స్ తో పాటు గుజరాత్ టైటాన్స్ మాత్రమే ఆసక్తిని చూపాయి
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి చెప్పకుండా భారత క్రికెట్ ను నిర్వచించలేము. క్లాస్ ఆటతో ఇండియన్ టీమ్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాల్ని అందించారు సచిన్. తండ్రి బాటలోనే సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. ఆల్ రౌండర్ గా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అండర్ -19 తో పాటు దేశవాళీ క్రికెట్ లో పలు మ్యాచ్ లు ఆడిన అర్జున్ టెండూల్కర్ పెద్దగా రాణించలేదు. ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతడికి రాలేదు. గత కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజ్ కు సచిన్ టెండూల్కర్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా సచిన్ తో అంబానీ కుటుంబానికి అనుబంధం ఉంది. అది దృష్టిలో పెట్టుకొనే అర్జున్ టెండూల్కర్ ను ముంబయి ఇండియన్స్ టీమ్ లో కొనసాగిస్తోంది. బెంగళూరులో జరిగిన మెగా వేలంలో మరోసారి ముంబయి ఇండియన్స్ అతడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది. గత వేలంలో 20 లక్షలకే అతడిని కొన్న ముంబయి ఈ సారి అదనంగా మరో పది లక్షలు పెంచడం సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది. మేనేజ్ మెంట్ కోటా ప్లేయర్, రిజర్వేషన్ ప్లేయర్ అంటూ అర్జున్ టెండూల్కర్ ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. అర్జున్ ను ముంబయి కొనుగోలు చేస్తుందని ముందుగానే ఊహించామని చాలా మంది పేర్కొంటున్నారు. వాటర్ బాటిల్స్ మోయడానికి 30 లక్షలు రెమ్యునరేషన్ అతడికి ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లోనే కాదు క్రికెట్ లోనూ నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విమర్శలను ముంబయి ఇండియన్స్ మాత్రం తేలికగా తీసుకుంటుంది. ఈ సీజన్ లోనైనా అర్జున్ టెండూల్కర్ కు ఆడే అవకాశం వస్తుందో లేదో చూడాలి.
సంబంధిత కథనం