Australia Coach on Pitch: మేమూ అదే చేస్తాం కదా.. పిచ్ వివాదంపై ఆస్ట్రేలియా కోచ్ షాకింగ్ కామెంట్స్
Australia Coach on Pitch: మేమూ అదే చేస్తాం కదా అంటూ పిచ్ వివాదంపై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాగ్‌పూర్ పిచ్ ను కావాలని ఇండియాకు అనుకూలంగా మారుస్తున్నారన్న ఆరోపణలను అతడు తేలిగ్గా తీసుకున్నాడు.
Australia Coach on Pitch: ఓ కీలకమైన సిరీస్ కు ముందు మైండ్ గేమ్స్ ఆడటం ఆస్ట్రేలియాకు అలవాటు. ఈసారి కూడా నాగ్‌పూర్ పిచ్ ను కావాలని ఇండియాకు అనుకూలంగా మారుస్తున్నారంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, మీడియా ఆరోపించడం వివాదాస్పదమైంది. అయితే ఈ పిచ్ వివాదాన్ని ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మాత్రం తేలిగ్గా తీసుకున్నాడు.
తన టీమ్ కండిషన్స్ కు తగినట్లుగా మారి సమస్యలను పరిష్కరించే వాళ్లుగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఈ సవాలుకు సిద్ధమని అన్నాడు. అయినా ఆస్ట్రేలియా కూడా పేస్ పిచ్ లనే తయారు చేస్తుంది కదా అని మెక్‌డొనాల్డ్ అనడం గమనార్హం.
"వికెట్ విసిరే సమస్యలను పరిష్కరించడమే మా పని. టెస్ట్ క్రికెట్ గొప్పతనం అదే. ఓ దేశం నుంచి మరో దేశానికి, ఓ దేశంలోనే ఒక్కో గ్రౌండ్ లో ఒక్కో కండిషన్స్ ఉంటాయి. నిజాయితీగా చెప్పాలంటే పిచ్ డ్రైగా ఉంది. ఇదే ఊహించాం. ఇండియాలో అత్యధిక టర్న్, రివర్స్ స్వింగ్ ఉన్న పిచ్ గా నాగ్‌పూర్ కు పేరుంది. ఈ సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాం" అని అతడు స్పష్టం చేశాడు.
"మా టీమ్ లో లెఫ్టాండర్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు కాస్త కష్టమే. ఎందుకంటే పిచ్ ఓవైపు పూర్తి డ్రైగా ఉంది. మరోవైపు తేమ ఉంది. ఇది సమస్యలను క్రియేట్ చేస్తుంది. కానీ మా బ్యాటర్లు వాటిని పరిష్కరిస్తారు" అని మెక్‌డొనాల్డ్ అన్నాడు. నాగ్‌పూర్ పిచ్ పై ఆస్ట్రేలియా మీడియా ఆరోపణలను తేలిగ్గా తీసుకున్నాడు.
"నేనలా అనుకోవడం లేదు. స్వదేశంలో కండిషన్స్ ను ఎవరైనా అనుకూలంగా మార్చుకుంటారు. ఆస్ట్రేలియాలో కాస్త అదనపు బౌన్స్, పచ్చిన ఉంటాయి. అందుకే దీనిని టెస్ట్ క్రికెట్ అంటారు. వివిధ కండిషన్స్, వివిధ దేశాల్లో ఆడుతుంటే మన నైపుణ్యాలకు నిజమైన టెస్ట్ ఉంటుంది. ప్రతి చోటా ఒకే కండిషన్స్ ఉంటే మజా ఏముంటుంది" అని మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశాడు.