Mirror: ఇంట్లో రెండు అద్దాలు ఎదురెదురుగా ఎందుకు పెట్టకూడదు? అలా చేస్తే ఏమవుతుంది?
Mirror: అద్దం మన ప్రతిబింబం అంటారు. అది మాత్రమే కాదు ఆత్మలకు ఆవాసంగా కూడ చెప్తారు. రెండు అద్దాలు ఎదురెదురుగా ఒకచోట కలిపి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు యాక్టివ్ గా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి.
ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించే వస్తువుల్లో అద్దం ఒకటి. హాల్ నుంచి బాత్ రూమ్ వరకు ఒక్కొక్క గదిలో ఒక్కో అద్దం ఏర్పాటు చేసుకుంటారు. మన అందాన్ని చూసుకునేందుకు మాత్రమే కాకుండా ఇంటికి అందాన్ని కూడా ఇవి ఇస్తాయి. విభిన్న సంస్కృతులలో అద్దాల వల్ల వేర్వేరు ఉపయోగాలు ఉన్నాయి.
అద్దాలు ఆత్మలకు ఆవాసాలు
కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలకు ఉపయోగిస్తారు. అద్దాలు ఆత్మలను సంగ్రహిస్తాయని చాలా మంది నమ్ముతారు. మన ప్రతిబింబాన్ని చూపించడమే కాకుండా మనలోని ఆత్మను చూపెడతాయి. చాలా సినిమాల్లో చూసే ఉంటారు అంతరాత్మలు అద్దంలో కనిపించి మాట్లాడుతూ ఉంటాయి. ఎక్కువ సేపు అద్దంలోకి చూసుకోవడం వల్ల మన ఆత్మ అందులో చిక్కుకుపోతుందని పెద్దలు చెప్తారు. అందుకే అద్దాలు తరచుగా ఆత్మను బంధిస్తాయని జానపద కథల్లో చెప్తూ ఉంటారు.
అనేక పురాణాలు, ఇతిహాసాల ప్రకారం అద్దాలు ఆత్మలు, చెడు శక్తులు వేరే ప్రపంచం నుంచి మనలోకి ప్రవేశించేందుకు అనుమతించే గేట్ వేగా చెప్తారు. ఇవి మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. ఫెంగ్ షూయితో పాటు వాస్తు ప్రకారం కూడా అద్దాలు శక్తిని పెంచే వస్తువులుగా పరిగణిస్తారు. అద్దాన్ని తప్పు ప్రదేశంలో ఉంచడం వల్ల వాటి శక్తి ప్రవాహానికి భంగం వాటిల్లుతుంది. అందువల్ల ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. ప్రధాన ద్వారం దగ్గర ఉంచే అద్దం ఇంట్లోని మంచి శక్తిని ప్రతిబింబిస్తుంది. ఇది లోపల ఉండకుండా చేస్తుంది.
ఎదురెదురుగా అద్దాలు ఉండొచ్చా?
ఒకే ప్రదేశంలో ఎప్పుడూ రెండు అద్దాలు ఉంచకూడదు. అలాగే రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఇది సమస్యలు కలిగిస్తుంది. ఇవి ఇంట్లోకి ప్రవేశించే శక్తి ప్రవాహంలో అవాంతరాలు సృష్టిస్తుంది. రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నప్పుడు శక్తి సహజ ప్రవాహానికి భంగం కలుగుతుంది. అప్పుడు ప్రతికూల శక్తులకు మార్గం తెరవబడుతుంది. అది మాత్రమే కాదు ఈ అద్దాల మధ్య ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. అద్దాలు ఒకదానికొకటి ప్రతిబింబిస్తూనే ఉంటాయి. శక్తి ముందుకు వెనుకకు వెళ్తూ ప్రతికూల శక్తులకు చోటు కల్పిస్తుంది.
ఇంట్లో అద్దాలు ఎదురెదురుగా లేకుండా చేయడానికి వీలు పడకపోతే మీరు ఒకదాన్ని వస్త్రంతో పూర్తిగా మూసివేయడం మంచిది. లేదంటే ఇవి ఆత్మలకు ఆవాసాలుగా మారిపోతాయి. అనేక సంస్కృతులలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఆత్మ అద్దంలోకి రాకుండా ఉండేందుకు ఇంటి అద్దాలకు మందపాటి వస్త్రాలు వేసి కప్పి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ప్రతికూలత, చీకటి శక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఒక మార్గంగా సహాయపడుతుంది.
అద్దాలు శుభ్రపరచాలి
అద్దాలు కొంత శక్తిని కలిగి ఉంటాయి. ఇతర ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళే సాధనాలుగా ఉపయోగపడతాయి. శక్తులను మోసుకెళ్లడం, వాటిని విస్తరించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించకుండ ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా వాటిని శుభ్రపరచాలి. అదే కొత్తగా అద్దం కొనుగోలు చేస్తే దాన్ని ముందుగా శుభ్రంగా తుడవాలి. తర్వాత పవిత్రమైన జలంతో దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత వినియోగించుకోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్