Navaratri fasting rules: నవరాత్రుల్లో ఉపవాసం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?-which rules are necessary to follow in navaratri fast ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri Fasting Rules: నవరాత్రుల్లో ఉపవాసం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Navaratri fasting rules: నవరాత్రుల్లో ఉపవాసం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Oct 02, 2024 10:00 AM IST

Navaratri fasting rules: శారదీయ నవరాత్రులలో కొంతమంది మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. కొందరు మొదటి, చివరి ఉపవాసం ఉంటారు. నవరాత్రి ఉపవాస సమయంలో కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. నవరాత్రి ఉపవాస నియమాలు తెలుసుకోండి.

నవరాత్రి ఉపవాసం నియమాలు
నవరాత్రి ఉపవాసం నియమాలు (pixabay)

శారదీయ నవరాత్రి పవిత్ర పండుగ అక్టోబర్ 3, 2024 గురువారం నుండి ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 12 దసరా పండుగతో ముగుస్తాయి. నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజించే సంప్రదాయం ఉంది.

నవరాత్రులలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, భక్తులు ఆచారాలతో పూజలు చేసి ఉపవాసం ఉంటారు. నవరాత్రి వ్రతాన్ని నిబంధనల ప్రకారం మాత్రమే పాటించాలి. హిందూ గ్రంధాల ప్రకారం ఉపవాస నియమాలను పాటించడం చాలా ముఖ్యం. నవరాత్రి ఉపవాసం కొందరు తొమ్మిది రోజులు ఉంటే మారికొదనరు మాత్రం చివరి రెండు రోజులు మాత్రమే ఉంటారు. తొమ్మిది రోజులు ప్రజలు ఖిచ్డీ, పండ్లు, ఇతర ఉపవాస వస్తువులను తీసుకుంటారు. అయితే ఇది కాకుండా ఉపవాసం పాటించడానికి కొన్ని నియమాలు మత గ్రంథాలలో వివరించారు. నవరాత్రి వ్రతంలో ఏ నియమాలు పాటించాలో తెలుసుకోండి.

నవరాత్రి ఉపవాస నియమాలు

1. నవరాత్రి వ్రతం పాటించే వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మంచం మీద కాకుండా నేల మీద నిద్రించడం ఉత్తమం. సుఖాలు, సౌకర్యాలు పక్కన పెట్టేయాలి.

2. నవరాత్రుల తొమ్మిది రోజులలో అబద్ధాలు ఆడకూడదు, కోపానికి దూరంగా ఉండాలి. ఎవరిని దూషించకూడదు. అనవసరమైన మాటలు ఉపయోగించి ఎదుటి వారి మనసు బాధపెట్టకూడదు.

3. ఈ తొమ్మిది రోజులలో స్త్రీని లేదా అమ్మాయిని ఏ విధంగానూ అవమానించకూడదు. ఇంట్లో ఆఖండ జ్యోతిని వెలిగించి అది ఎప్పుడూ ఆరిపోకుండా చూసుకోవాలి.

4. సాధారణంగా ప్రజలు రోజుకు రెండుసార్లు ఆహారం కడుపునిండా తిన్న తర్వాత ఉపవాసం పాటిస్తారు. కానీ అలా చేయకూడదు. ఇలా చేసే ఉపవాసం ఎటువంటి ఫలితాలను ఇవ్వదని నమ్ముతారు. ఉపవాసం భక్తిశ్రద్దలతో నియమ నిష్టలతో మాత్రమే చేయాలి.

5. నవరాత్రుల తొమ్మిది రోజులలో ఉపవాసం ఉన్న వ్యక్తి గుట్కా, పాన్, మసాలా ఆహారం లేదా మాంసం, మద్యం తీసుకోరాదు. ఉపవాస సమయంలో పదే పదే నీరు త్రాగడం మానుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి పొరపాటున కూడా ఉపయోగించకూడదు. ఇవి తీసుకోవడం వల్ల మనసు చంచలంగా మారుతుంది. అందుకే వీటిని ఉపవాసం సమయంలో దూరంగా ఉంచుతారు. తరుచుగా నీరు కూడా తీసుకోకూడదు.

6. నవరాత్రి వ్రతాన్ని మధ్యలో విరమించకూడదు. ఏదైనా తీవ్రమైన సమస్య లేదా అనారోగ్యం బాధిస్తే దుర్గాదేవికి నుండి క్షమాపణ కోరడం ద్వారా మాత్రమే ఉపవాసం విరమించవచ్చు.

7. మీరు సప్తమి, అష్టమి లేదా నవమి తిథిలలో నవరాత్రి వ్రతాన్ని విరమిస్తే మీరు తప్పనిసరిగా ఉపవాసం ఉద్యాపన చేసి, తొమ్మిది మంది అమ్మాయిలకు అన్నదానం చేసి దక్షిణ ఇచ్చి వారిని సంతోషంగా పంపించాలి. ఇలా చేస్తేనే ఉపవాస ఫలాలు లభిస్తాయని నమ్మకం.

8. నవరాత్రి ఉపవాసం ఉంటున్న వాళ్ళు గడ్డం, మీసం, గోర్లు, వెంట్రుకలు వంటివి కత్తిరించడం వంటివి చేయకూడదు.

9. నల్లని రంగు దుస్తులు ధరించి దుర్గామాతను పూజించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు.

10. మత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వస్తుందని నమ్ముతారు. అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు దుర్గా చాలీసా లేదా దుర్గా సప్తశతి పఠించవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

టాపిక్