Lord vishnu: అనంత చతుర్దశి రోజు ఆచరించే అనంత పద్మనాభ వ్రతం ఏంటి? ఎలా ఆచరించాలి?-what is ananta padmanabha vratham performed on ananta chaturdashi day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Vishnu: అనంత చతుర్దశి రోజు ఆచరించే అనంత పద్మనాభ వ్రతం ఏంటి? ఎలా ఆచరించాలి?

Lord vishnu: అనంత చతుర్దశి రోజు ఆచరించే అనంత పద్మనాభ వ్రతం ఏంటి? ఎలా ఆచరించాలి?

HT Telugu Desk HT Telugu
Sep 16, 2024 07:15 PM IST

Lord vishnu: సెప్టెంబర్ 17న అనంత చతుర్ధశి వచ్చింది. ఈరోజు అనంత పద్మనాభ వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. ఈ వ్రతం ఎలా ఆచరించాలి? దీని ప్రాముఖ్యత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

అనంత పద్మనాభ వ్రతం ఎలా ఆచరించాలి?
అనంత పద్మనాభ వ్రతం ఎలా ఆచరించాలి? (pixahive)

Lord vishnu: పరమాత్మ కాలస్వరూపుడు. ఆద్యంతాలు లేనివాడు. తనను భక్తితో అర్చించే వారికి అనంతమైన వరాలు ప్రసాదించే భక్తవరదుడు. అంతటి దయామయుడైన పరమాత్మను 'అనంతపద్మనాభ' స్వరూపంలో అర్చిస్తూ ఆచరించే వ్రతమే “అనంత పద్మనాభ వ్రతం”. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ఈ వ్రతం ప్రసిద్ది పొందింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పన్నగశాయి పరమాద్భుత రూపం అనంతపద్మనాభుడు. సృష్టి, స్థితి, లయ తత్త్వాలకు ప్రతిబింబంగా కనిపించే పద్మనాభుడి దివ్యమంగళరూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. కావేరి తీరంలో పద్మనాభుడిగా, తెలుగునాట రంగనాథుడిగా భక్తులు పూజలు అందుకుంటున్నాడు స్వామి. ఆయన సేవలో తరించే అవకాశం కల్పిస్తున్నది 'అనంతపద్మనాభవ్రతం'. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కష్టాలు తీరిపోవాలని, కోరికలు నెరవేరాలని కోరుతూ దీనిని నిర్వహిస్తారు. పద్మనాభుడి అర్చనలో సర్పరాజమైన అనంతుణ్ణి ఆరాధించడం ఈ వ్రతం ప్రత్యేకత అని చిలకమర్తి తెలిపారు.

వ్రత విధానం

అనంత పద్మనాభ వ్రతానికి సంబంధించిన విధి విధానాలు భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తాయి. ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకుని అందులో 14 పడగలు కలిగిన అనంతుడి ప్రతిమను ఉంచాలి. పూజ ప్రారంభంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, మంటపారాధన చెయ్యాలి. ఆ తర్వాత యమునా పూజ (వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్రజలాలను ఉంచాలి. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వెయ్యాలి. కలశంలోని నీటిలోకి యమునానదిని ఆవాహన చేసి, శాస్త్ర విధానంగా అర్చనలు నిర్వహించాలి) చెయ్యాలి.

పిండితోగానీ, దర్భలతోగానీ ఏడుపడగల సర్పాన్ని తయారు చేసి, అష్ట దళపద్మమంటపంపై గానీ, కలశంపై గానీ అనంతస్వామిని ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు చేయాలి. బెల్లంతో చేసిన 28 అరిసెలను నివేదన చెయ్యాలి. వ్రత కథ చదువుకుని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి, అక్షతలు తలపై చల్లు కోవాలి. వ్రతంలో భాగంగా 14 ముడులు కలిగిన ఎర్రని తోరాలను స్వామి దగ్గర ఉంచి వ్రతపరిసమాప్తి తర్వాత వాటిని దంపతులు తమ చేతులకు ధరించాలి.

ఒకసారి వ్రతదీక్షను స్వీకరించిన దంపతులు ఏటా తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. కుదరని పక్షంలో ఎవరైనా వ్రతంలో ఉంచిన తోరాలనైనా తప్పని సరిగా ధరించాలి. పౌర్ణమితో కూడుకున్న చతుర్దశి అయితే అనంతవ్రతానికి మరింత శ్రేష్ఠమని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయని చిలకమర్తి తెలియచేశారు.

అనంతమైన ఫలితాలు

అనంత పద్మనాభ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించడం వల్ల బాధలు తొలగిపోతాయి. 'అనంత' అనే పదానికి ‘అంతము కానిది అంతం లేనిది' అని అర్థం. దీని ప్రకారం అనంత వ్రతం ఆచరించడం వల్ల అంతులేని ఆనందం లభిస్తాయని తెలుస్తోంది. సనాతనకాలం నుంచి ఈ వ్రతం మన దేశంలో ఆచరణలో ఉన్నట్లు పురాణ, ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది.

వనవాసం సమయంలో కష్టాలు అనుభవిస్తున్న ధర్మరాజు వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపదశుక్ల చతుర్దశినాడు చేయమని చెబుతాడు.

అనంతుడన్నా, అనంత పద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అనీ, యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమేనని కృష్ణుడు స్వయంగా వివరిస్తాడు. అనంత పద్మనాభుడంటే కాలస్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమైన శ్రీకృష్ణుడు పాలకడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి, నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్యస్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల కౌండిన్య దంపతులు సకలసంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఇదీ అంతరార్థం

వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుణ్ణి ఆ ఆది శేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహా విష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రతసంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి, దాన్ని మూత పెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. అనంత పద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళస్వరూపుణ్ణి తలచుకోవటం కోసమే.

వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగ దూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి ధర్మజీవనవిధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.

తిరుమలలో అనంత వ్రతం ఏటా తిరుమలలో భాద్రపదశుద్ధ చతుర్దశి రోజున అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి శ్రీవరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner