Varalakshmi vrata katha: సకల సౌభాగ్యాలు అందించే వరలక్ష్మీ వ్రత కథ గురించి తెలుసుకోండి-varalakshmi vratam date and significane and vrata katha in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Varalakshmi Vrata Katha: సకల సౌభాగ్యాలు అందించే వరలక్ష్మీ వ్రత కథ గురించి తెలుసుకోండి

Varalakshmi vrata katha: సకల సౌభాగ్యాలు అందించే వరలక్ష్మీ వ్రత కథ గురించి తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Aug 15, 2024 03:36 PM IST

Varalakshmi vrata katha: ఆగస్ట్ 16 వరలక్ష్మీ వ్రతం చేసుకోనున్నారు. ఈ వ్రతంలో తప్పనిసరిగా వరలక్ష్మీ వ్రత కథను పఠించాలి. వ్రత కథను గురించి సవివరంగా ఇక్కడ తెలుసుకోండి.

వరలక్ష్మీ వ్రత కథ
వరలక్ష్మీ వ్రత కథ (pinterest)

Varalakshmi vrata katha: పవిత్రమైన శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మీ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. కలశ స్థాపన చేసి అందంగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముత్తైదువులను పిలిచి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఒక్కరు చేసుకునేది కాదు. ముత్తైదువులను పిలిచి సంతోషంగా మనతో పాటు వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చేసుకుంటారు.

వరలక్ష్మీ వ్రతం రోజు దీనికి సంబంధించిన కథ చదువుకోకుండా వ్రతం పూర్తి కాదు. ఈ వ్రత కథ స్వయంగా పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఉపదేశించారు. ఈ వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినా, వ్రత కథ విన్నా పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు.

వ్రత కథ

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకరమైన వ్రతం గురించి పరమ శివుడు పార్వతి దేవికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు కూడా తెలియజేస్తున్నాను శ్రద్దగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు భస్మ సింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు ఈశ్వరుడిని స్తోత్రాలతో కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీ దేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాథా స్త్రీలు సర్వ సౌఖ్యాలతో, పుత్రులతో తరించుటకు తగిన వ్రతం గురించి చెప్పమని అడిగింది.

దేవీ..! నీవు కోరినట్టుగా ఒక వ్రతం ఉంది. అదే వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసం రెండవ శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి ఈ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారని ప్రశ్నించింది. ఎలా చేయాలో తెలియజేయమని అడిగింది.

పూర్వ కాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి వినయవిధేయురాలు. దైవభక్తి కలిగిన మహిళ. ప్రతిరోజు ప్రాతః కాలాన నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించి గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది.

ఒకనాడు వరలక్ష్మీదేవి చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైనది. హే జనని నీ కృప కటాక్షములు కలిగిన వారు ధన్యులు, సంపన్నులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తతో అత్తమామలకు తెలియజేసింది. వారు సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతం చేసుకోమని చెప్పారు.

ఊర్లోని ముత్తయిదువులను చారుమతి పిలిచి తన కల గురించి చెప్పి వ్రతం చేసుకుందామని వివరించింది. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తల స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె తన గృహంలో మంటపం ఏర్పాటు చేసి మండపంపై బియ్యం పోసి రావి, జువ్వు, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీ దేవిని ఆహ్వానించింది.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే

అంటూ ఆహ్వానించి అమ్మవారిని ప్రతిష్టించింది. అనంతరం షోడపచారాలతో పూజించారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి ధరించారు. ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షణ చేయగానే కాలి గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నాయి. రెండో ప్రదక్షణ చేయగానే చేతులకు నవరత్న ఖజిత కంకణాలు ధగధగా మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణం భరితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి కుటుంబంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుంచి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు.

వారంతా మార్గమధ్యంలో చారు మాత్రమే ఎంతగానో పొగుడుతూ ఆమె వరలక్ష్మి దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. అలా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలు సిరిసంపదలతో జీవించారు.

మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని సూత ముని శౌనికాది మహర్షులకు చెప్పారు. ఈ వ్రతం చేసుకొని అక్షతలు తీసుకొని శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు కుంకుమలు ఇవ్వాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తీర్థప్రసాదాలను తీసుకోవాలి.