Deeparadhana: కార్తీకమాసంలో ఏ వత్తులతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?
Deeparadhana: కార్తీకమాసంలో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అయితే ఏ వత్తులతో చేయాలి? ఎన్ని వత్తులు ఉపయోగించాలి? ఏ దిక్కున దీపాలు పెట్టాలి అనే విషయాల గురించి సవివరంగా తెలుసుకోండి.
దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే
దీపం విశిష్టతను తెలియజేసే శ్లోకం ఇది. కార్తీకమాసంలో దీపారాధను విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో తప్పనిసరిగా దీపారాధన చేయడం చేస్తారు. స్నానం, జపం, దానం, దీపం వంటి వాటికి కార్తీక మాసంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది.
దీపారాధన చేయడం వల్ల దైవానికి దగ్గర అవుతారు. ప్రతిరోజూ దీపారాధన చేసే ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉండబోవని నమ్ముతారు. అయితే కార్తీకమాసంలో దీపారాధన ఎలా చేయాలి? ఎన్ని ఒత్తులు వేయాలి? ఏ నూనె వినియోగించాలి? దీపారాధనకు ఏ లోహంలో చేసిన కుందులు ఉపయోగించాలి అనే విషయాలు తప్పని సరిగా తెలుసుకోవాలి.
దీపారాధన చేసేందుకు సరైన పద్ధతలు అనుసరించాలి. ముందుగా దీపం కుందులో నూనె వేసి ఆ తర్వాత వత్తులు వేసుకోవాలి. దీపారాధనకు అన్నింటి కంటే రాగి లేదా మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు. లేదంటే వెండి, పంచ లోహం, ఇత్తడి కుందులు వినియోగించుకోవచ్చు. ప్రతిరోజూ దీపారాధన చేసే ముందు తప్పనిసరిగా కుందులు శుభ్రపరుచుకోవాలి. అలాగే నేల మీద కుందులు పెట్టి దీపారాధన చేయడం ఎంత మాత్రం సరికాదు. దాని కింద తమల పాకు లేదా ఏదైనా పళ్ళెం కానీ పెట్టుకోవాలి.
నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె, వేప నూనె వంటి వాటితో దీపారాధన చేసుకోవచ్చు. నెయ్యి వేసి దీపారాధన చేస్తే ఇంట్లో సర్వ సుఖాలు కలుగుతాయి. అదే నువ్వుల నూనెతో చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్య సుఖం లభిస్తుంది.
ఎన్ని వత్తులు వేయాలి?
దీపారాధన చేసే సమయంలో ఎన్ని వత్తులు వేయాలి అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక వత్తి వేస్తే శుభం జరుగుతుంది. అదే రెండు వత్తులు వినియోగిస్తే కుటుంబ సౌఖ్యం, మూడు వత్తులకు పుత్ర సంతానం, ఐదు వత్తులు వేస్తే ధనం, ఆరోగ్యం, దీర్ఘాయుష్హు లభిస్తాయి. ఇలా మీకు అనుకూలంగా ఉండే విధంగా అభీష్టాలకు సరిపడా వత్తులు వేసుకుని దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధనలో దీపం ఎప్పుడూ అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏక హారతిలో కర్పూరం వెలిగించి దాని సహాయంతో దీపం వెలిగించాలి.
ఏ దిక్కున వెలిగించాలి?
తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో దీపాలు వెలిగించుకోవచ్చు. ఒక్కో దిక్కులో దీపం పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తూర్పు దిక్కున వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. పశ్చిమ దిక్కున అప్పుల బాధలు, ఉత్తరాన ధనాభివృద్ధి లభిస్తుంది. దక్షిణ దిక్కులో మాత్రం దీపం వెలిగించకూడదు. అలా చేస్తే కుటుంబంలో కష్టాలు ఎదురవుతాయి.
దీపారాధనకు పత్తి, అరటి, జిల్లేడు, తామర నారలు ఉపయోగించుకోవచ్చు. వీటితో దీపం వెలిగిస్తే ఆయుష్హు పెరుగుతుంది. పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. జిల్లేడు నారతో దీపం వెలిగిస్తే దుష్టశక్తుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. దీపం దానంతట అదే కొండెక్కాలి. పొరపాటున కూడా నోటితో ఆర్పకూడదు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.