Karthika masam 2024: కార్తీక మాసంలో మీ ఇంట్లో ఈ మొక్క నాటండి-అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి
Karthika masam 2024: కార్తీకమాసంలో వచ్చే అక్షయ నవమి రోజు ఉసిరిని పూజించే సంప్రదాయం ఉంది. అలాగే ఈ మాసంలో మీ ఇంట్లో ఉసిరి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
కార్తీకమాసంలో ఉసిరి చెట్టును పూజించడం, దాని కింద దీపాలు వెలిగించడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అలాగే ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు. ఉసిరి దీపం వెలిగిస్తారు. ఇలా కార్తీక మాసానికి, ఉసిరికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
పవిత్రమైన కార్తీకమాసం శుక్ల పక్ష నవమి రోజును ఉసిరి నవమి లేదా అక్షయ నవమి అని కూడా పిలుస్తారు. అక్షయ నవమి రోజున విష్ణువు, ఉసిరి మొక్కను పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని భావిస్తారు. ప్రతి సంవత్సరం అక్షయ నవమిని కార్తీక మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదో తేదీన జరుపుకుంటారు. దీనిని ఉసిరి నవమి అని కూడా అంటారు.
దృక్ పంచాంగ్ ప్రకారం అక్షయ నవమి ఈ సంవత్సరం నవంబర్ 10 న. మత విశ్వాసాల ప్రకారం అక్షయ నవమి రోజున ఆచారాల ప్రకారం ఉసిరి చెట్టును పూజించాలి. ఇది కుటుంబం సంతోషంగా , శ్రేయస్సుగా ఉంచుతుంది. ఈ ఏడాది ఉసిరి నవమి నాడు ధృవ యోగం, రవియోగం ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది. దీనితో పాటు, ఈ రోజున ఉసిరి చెట్టును నాటడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఉసిరి చెట్టును నాటేటప్పుడు, వాస్తులోని కొన్ని ప్రత్యేక అంశాలను గుర్తుంచుకోవాలి. ఇంట్లో ఉసిరి మొక్కను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఏ దిశలో ఈ మొక్కను నాటాలి అనేది తెలుసుకుందాం.
ఉసిరి మొక్కను నాటడానికి వాస్తు చిట్కాలు
అక్షయ నవమి రోజున మీరు ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉసిరి చెట్టును నాటవచ్చు. ఇది కాకుండా ఉసిరి మొక్కను ఈశాన్య దిశలో కూడా నాటవచ్చు.
ఉసిరి చెట్టును గురువారం, శుక్రవారం లేదా అక్షయ నవమిలలో నాటవచ్చు. ఇది ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుందని నమ్ముతారు. ఉసిరిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. క్రమం తప్పకుండా ఉసిరి చెట్టుకు పూజ చేస్తే ఆ ఇంట్లో దేవుళ్ళు, దేవతలు కొలువై ఉంటారని లక్ష్మీదేవి కటాక్షం నిరంతరం ఉంటుందని విశ్వాసం.
ఉసిరి మొక్క నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఉసిరి మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఉసిరి చెట్టును సరైన దిశలో నాటడం ద్వారా, లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ఇంట్లో ఉసిరి చెట్టును నాటడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీంతో సంపద పెరుగుతుంది.
ఉసిరి చెట్టుపై విష్ణువు ఉంటాడని చెబుతారు. అందువల్ల, ఉసిరి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. నమ్మకాల ప్రకారం ఇంట్లో ఉసిరి మొక్క ఉంటే కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. అక్షయ నవమి రోజున ఉసిరి మొక్కను పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా నమ్ముతారు. ఉసిరి చెట్టు నీడలో కూర్చుని వనభోజనాలు చేయడం వల్ల అనేక రోగాల నుంచి విముక్తి కలుగుతుందని అంటారు. అందుకే కార్తీక మాసంలో చాలా మంది తప్పనిసరిగా వనభోజనాలు చేస్తారు. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిదని నమ్ముతారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.