Weekly Horoscope । ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి!
Weekly Horoscope Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 01, 2022 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వార ఫలాలు ఇక్కడ ఉన్నాయి.
Weekly Horoscope Telugu : తెలుగు రాశి ఫలితములు (వార ఫలితము)
సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: ఆశ్వీయుజం
మేష రాశి :
మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థముగా ఉన్నది. ఖర్చులు నియంత్రించడం మంచిది. జన్మ రాహువు, వాక్ స్థానము నందు కుజగ్రహ సంచారం చేత గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబములో చికాకులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అధికముగా ఉండును. అయినప్పటికి ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నించెదరు. వ్యయ స్థానములో గురు సంచారము వలన ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్త ఫలితములు, వ్యాపారస్తులకు అధికముగా ఖర్చు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితములు ఈ వారం గోచరిస్తున్నవి. మేషరాశివారు మరింత శుభ ఫలితం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.
వృషభ రాశి :
వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. వృషభ రాశి వారికి జన్మరాశి యందు కుజుని ప్రభావం చేత ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారములయందు చికాకులు ఏర్పడును. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. వృషభ రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.
మిథున రాశి :
మిథున రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం వలన ఆందోళన, ఇబ్బందులు కలుగును. వ్యాపారము ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుక్రుడు, బుధుడు అనుకూల స్థితి వలన కుటుంబ సౌఖ్యము మరియు ధన లాభము కలుగును. వ్యయస్థానములో కుజుని ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొనెదరు, వృధా ఖర్చులు పెరుగును. మానసిక ఉల్లాసము కొరకు ధనమును ఖర్చు చేసెదరు. మృష్టాన్న భోజనము, సౌఖ్యము కలుగును. ప్రయాణములు అనుకూలించును. ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం మిథున రాశి వారు బుధవారం రోజు మహా విష్ణువును పూజించి, విష్ణు సహస్రనామాన్ని పఠించలెను. అలాగే దశరథ శని ప్రోక్త స్తోత్రాన్ని శనివారం పఠించడం మంచిది.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వచ్చును. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్థిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి.
సింహ రాశి :
సింహరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. గత కొంత సమయంతో పోల్చి చూసినట్లయితే ఈ వారం మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. ద్వితీయ స్థానములో రవి, బుధుల సంచారము వలన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు నూతనంగా వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అష్టమ గురుని ప్రభావము వలన కుటుంబ వ్యవహారాల యందు, ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగములతో చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్తుల అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగించును. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.
కన్య రాశి :
కన్యారాశి వారికి ఈ వారం మీకు మధ్యస్త ఫలితము ఉన్నది. జన్మరాశి రవి సంచరించుట వల్ల వత్తిళ్ళు అధికముగా ఉండును. శారీరక శ్రమ ఏర్పడును. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు వెళ్ళి విజయము పొందెదరు. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతి పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.
తులా రాశి :
తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. శత్రువులతో జాగ్రత్త వహించాలి. కుటుంబ వ్యవహారాలు ఒత్తిడికి గురి అగును. జన్మరాశి యందు కేతువు అష్టమ స్థానము నందు కుజుడు, శత్రు స్థానము నందు గురుని యొక్క సంచారము వలన తులా రాశి వారికి ఉద్యోగము నందు ఒత్తిడి, రాజకీయ శత్రుత్వ భయము కలుగును. కుటుంబము నందు మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అప్పుల ఒత్తిడి ఉండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.
వృశ్చిక రాశి :
వృశ్చికరాశికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఖర్చులు పెరుగును. ఆర్భాటాలకు దూరంగా ఉండటం మంచిది. శని అనుకూల ప్రభావముచేత, పంచమ స్థానము గురువు, ఆరవ స్థానము రాహువు ప్రభావము చేత అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. సమాజము నందు కీర్తి కుటుంబము నందు గౌరవము పెరుగును. లాభము రవి ప్రభావము చేత ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయము. ధన లాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు, పిల్లల వలన చికాకులు కలుగును. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనలాభము కలుగును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.
ధనుస్సు రాశి :
ధనూ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితములు ఉన్నవి. లాభ స్థానము నందు కేతువు, దశమ స్థానము నందు రవి, బుధులు భాగ్యం నందు శుక్రుని సంచారము వలన అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. కుటుంబము నందు సౌఖ్యము, కీర్తి కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు మరియు పనుల యందు ఆలస్యము ఏర్పడును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనుస్సు రాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించటం చేయాలి.
మకర రాశి :
మకర రాశి వారికి ఈ వారం మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. జన్మరాశి యందు శని వక్రియై సంచరించుట వలన అలాగే తృతీయము నందు గురుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. పంచమమునందు గురుడు, భాగ్యమునందు రవి బుధుల అనుకూలత వలన మీయొక్క కృషితో పట్టుదలతో ముందుకు వెళ్ళి కార్యములు పూర్తి చేసేదరు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.
కుంభ రాశి :
కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ధన స్థానము నందు బృహస్పతి సంచారము వలన కుటుంబ వ్యవహారాలు, ఆర్ధిక విషయాల యందు పురోగతి కనబడును. ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం. ధనవ్యయము ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టును. అప్పు చేసి ముందుకు వెళ్ళవలసినటువంటి గ్రహస్థితి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించును. ఉద్యోగస్తులకు కష్టకాలము. వ్యాపారస్తులకు అనుకూలంగా లేనటువంటి సమయము. ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉన్నవి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.
మీన రాశి :
మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్తముగా ఉన్నది. జన్మరాశి యందు గురుని ప్రభావం చేత మీన రాశివారికి ఆరోగ్య సమస్యలు మరియు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. మీన రాశివారు గురువారం రోజు శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.
సంబంధిత కథనం
టాపిక్