Varuthini ekadashi 2024: నేడే వరూథిని ఏకాదశి.. శుభ ముహూర్తం, పూజా విధానం, వ్రత కథ ప్రాముఖ్యత తెలుసుకోండి
Varuthini ekadashi 2024: మే 4వ తేదీ వరూథిని ఏకాదశి జరుపుకుంటున్నాం. ఈ ఏకాదశి శుభ ముహూర్తం, పూజా విధానం, వ్రత కథ ప్రాముఖ్యత గురించి ఇక్కడ తెలుసుకోండి.
Varuthini ekadashi 2024: సనాతన ధర్మంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. నెలకు రెండు ఏకాదశులు ఉంటాయి. ఒకటి కృష్ణపక్షం, మరొకటి శుక్లపక్షం. మే 4వ తేదీ వరూథిని ఏకాదశి జరుపుకుంటున్నారు.
ఈ ఏకాదశి ఉపవాసాన్ని పాటించడం వల్ల దురదృష్టం అదృష్టంగా మారుతుందని నమ్ముతారు. దీనితోపాటు భక్తుడికి జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ పవిత్ర ఉపవాసాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుంది. ఏకాదశి ఉపవాసం గురించి పద్మ పురాణంలో ప్రస్తావించారు. శ్రీకృష్ణుడు వరూథిని ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను యుధిష్టిరుడికి చెప్పాడు. భూమి మీద ప్రతి ఒక్కరి కర్మలను లెక్కపెట్టి చంద్రగుప్తుడు కూడా ఈ ఉపవాసం వల్ల వచ్చే సద్గుణాన్ని సరిగా లెక్కించలేకపోయాడని అంటారు. ఏకాదశి ఉపవాసానికి అంతటి విశిష్టత ఉంటుంది. ఈ ఉపవాసం పాటించే వ్యక్తిని విష్ణువు ప్రతి సంక్షోభం నుంచి రక్షిస్తాడు.
శుభ ముహూర్తం
మే 4వ తేదీ పూజ చేసేందుకు శుభ ముహూర్తం ఉదయం 5.51గంటల నుంచి 8.28 గంటల వరకు ఉంటుంది.
వరూథిని ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామం పారాయణం ఎంతో ఫలప్రదం. ఈరోజు కంచు పాత్రలో ఆహారం తినకూడదనే విషయాన్ని గుర్తించుకోవాలి. అలాగే పొరపాటున కూడా అన్నం తినకూడదు. వరూథిని ఏకాదశి రోజు విష్ణు మూర్తి వామన అవతారాన్ని పూజిస్తారు.
వరూథిని ఏకాదశి పూజ విధి
ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఉపవాసం ప్రారంభించాలి. తర్వాత పూజ గదిలో బలిపీఠం ఏర్పాటు చేసే దానిపై పెసలు, శనగలు, బార్లీ, బియ్యం, చిరుధాన్యాలు వంటివి ఉంచాలి. పీట మీద కలశాన్ని ప్రతిష్టించి అందులో మామిడి లేదా అశోక వృక్షం ఐదు ఆకులను ఉంచాలి.
ఇప్పుడు బలిపీఠంపై విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి. పసుపు పువ్వులు, తులసిని విష్ణు మూర్తికి సమర్పించాలి. ధూపం, దీపంతో పూజ చేయాలి. ఏకాదశి ఉపవాసం ఆచరించిన వాళ్ళు మరుసటి రోజు ఉదయాన్నే బ్రాహ్మణుడికి అన్నదానం చేసి వీలైనంతవరకు దానధర్మాలు చేసి పంపించాలి. ఆ తర్వాత ఆహారం తిని ఉపవాసం విరమించాలి.
వరూథిని ఏకాదశి వ్రతం కథ
పూర్వకాలంలో నర్మదా నది ఒడ్డున మందాత అనే రాజు నివసించేవాడు. భక్తి భావం ఎక్కువగా ఉండే రాజు నిత్యం తపస్సు చేస్తూ ఉండేవాడు. ప్రజల పట్ల కరుణగా ఉండేవాడు. రాజు ఒకనాడు తపస్సులో ఉన్న సమయంలో ఒక ఎలుగుబంటి అతని కాలుని గాయపరిచింది. అడవి వైపు లాక్కుని వెళ్ళింది. అప్పుడు రాజు విష్ణుమూర్తిని ప్రార్థించాడు.
విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని సంహరించి రాజుని రక్షించాడు. తన కాలు పోయినందుకు రాజు చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇది నీ పూర్వజన్మ పాఠం వల్ల జరిగింది. దీన్ని వదిలించుకోవాలంటే వరూథిని ఏకాదశి ఉపవాసం ఉండి తన వరాహ అవతార విగ్రహాన్ని పూజించమని విష్ణు మూర్తి సెలవిచ్చారు. ఆ విధంగా రాజు వరూథిని ఏకాదశి ఉపవాసం ఆచరించి పాపాలు పోగొట్టుకున్నాడు.
పురాణాల ప్రకారం వరూథిని ఏకాదశికి సంబంధించి మరొక కూడా ప్రాచుర్యంలో ఉంది. శివుడు బ్రహ్మ ఐదవ తలని ఖండించాడు. దీంతో శివుడ్ శాపానికి గురవుతాడు. దాన్ని పోగొట్టుకునేందుకు వరూథిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు. ఫలితంగా పాపాల నుంచి విముక్తి లభించింది. మత విశ్వాసాల ప్రకారం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యఫలం లభిస్తుంది.