Home Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తప్పవు-these things never keep in your home on basis of home vastu tips ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Home Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తప్పవు

Home Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తప్పవు

HT Telugu Desk HT Telugu
Dec 05, 2023 10:21 AM IST

Home Vastu Tips: పనిచేయని, పగిలిపోయిన వస్తువులు పారేయకుండా ఇంట్లో అలాగే ఉంచుకుంటున్నారా? అవి మీ జీవితంలో కష్టాలని తీసుకొస్తాయని మీకు తెలుసా?

home vastu: ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచరాదు?
home vastu: ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచరాదు? (Pixabay)

ఇంటిని అందంగా అలంకరించడం కూడా ఒక ఆర్ట్. ఇది మన జీవన విధానాన్ని, ప్రవర్తన, స్వభావాన్ని వివరిస్తుంది. ఒక్క మాత్రలో చెప్పాలంటే ఇల్లు సర్దుకునే విధానం మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో సూచిస్తుంది.

ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే సర్దుకోవాలి. లేదంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇల్లు అందంగా కనిపించడం కోసం పెట్టుకునే కొన్ని వస్తువులు ప్రతికూల శక్తులని ఆకర్షిస్తాయి. ఇంట్లో ఆనందం, సంతోషం ఉండాలంటే కొన్ని వస్తువులు పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు.

గడియారాలు

టైమ్ చూసుకునేందుకు మాత్రమే కాదు ఇంట్లో అడుగు పెట్టగానే ఆకర్షించేలా కనిపించేందుకు గోడ గడియారాలు పెట్టుకుంటారు. కొంతమంది ఆకర్షణ కోసం పని చేయని గడియారాలు ఉంచుకుంటారు. కాని అవి ఇంట్లో అసలు ఉండకూడదు. ప్రతికూల శక్తులని ఆకర్షిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వాటిని వెంటనే తొలగించకపోతే ఇంట్లో సమస్యలకు కారణమవుతుంది.

యుద్ధ చిత్రాలు

యుద్ధభూమిని చిత్రీకరించే పెయింటింగ్స్ ఎప్పుడూ ఉంచుకోవద్దు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం అటువంటివి ఉండటం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు వస్తాయి. నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. వాటికి బదులుగా సంపద, అదృష్టం కోసం లక్ష్మీదేవి చిత్రాలు పెట్టుకోవడం మంచిది.

పగిలిన, విరిగినవి అసలే వద్దు

విరిగిన, పగిలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు. దీని వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఎక్కువ మంది అద్దం విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తారు. కొంచెమే కదా పగిలింది ఉంటే ఏం కాదులే అనుకుంటారు. కానీ పగిలిన వస్తువు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అవి మాత్రమే కాదు విరిగిన దేవుడు విగ్రహాలు కూడా తీసేయాలి. లేదంటే సమస్యలు వస్తాయి.

పాత చెప్పులు

చెప్పులు అరిగిపోయినవి, తెగిపోయినవి, పాతగా ఉన్న వాటిని కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. అవి ఇంట్లో పెట్టుకుంటే శని ఆశీస్సులు లభించవని చెబుతారు.

ముళ్ళ మొక్కలు

ఇంట్లో సోఫాల ముందు టేబుల్ మీద లేదంటే ఇతర ప్రదేశాల్లో అందంగా ఉండేందుకు చిన్న చిన్న మొక్కల కుండీలు పెట్టుకుంటారు. గులాబీ మినహా కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ముళ్ళ మొక్కలు పెట్టుకుంటే కుటుంబ సభ్యులతో ఉండే సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది.

తాజ్ మహల్

ప్రేమకు చిహ్నం తాజ్ మహల్. ఇంట్లో షోకేస్ లో దాన్ని పెట్టుకుంటే అందంగా ఉంటుందని అనుకుంటారు. వాస్తవానికి అవి ప్రతికూలతని తీసుకొస్తాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల అందంగా ఉంటుంది కానీ హాని చేస్తుందని అంటుంటారు.

అడవి జంతువుల విగ్రహాలు

ఇప్పుడు ఇది చాలా ఇళ్ళలో ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంట్లో పులి, చిరుత, కొమ్ములు పెద్దవిగా ఉండే జింకల విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఇవి కోపానికి సంకేతం. మీ వైవాహిక జీవితంలో సమస్యల్ని సృష్టిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో వీటిని అసలు పెట్టకూడదు. హింసాత్మక ధోరణికి ప్రతీకగా నిలుస్తుంది.

Whats_app_banner