Sravana Purnima : శ్రావణ పౌర్ణమి ఎప్పుడు? రక్షాబంధన్ ఏ సమయంలో ఆచరించాలి?
Sravana Purnima : ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి ఆగస్టు 31న జరుపుకోవాలని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి తెలిపారు. రక్షాబంధన్ గురువారం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో ఆచరించాలని సూచించారు.
Sravana Purnima : ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి 31 ఆగస్టు 2023న జరుపుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మి కవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ జరుపుకునేటప్పుడు ఏనబద్దో బలీరాజా దానవేంద్రో మహాబలం! తేనత్వామఖి బధ్నామి రక్షమాచలమాచల!! అనే స్తోత్రాన్ని చదువుకుంటూ అన్నావెల్లెలు రక్షాబంధన్‌ను జరుపుకోవాలని సూచించారు. సూర్యోదయ సమయానికి పౌర్ణమి ఉండటంచేత ఆగస్టు 31వ తేదీన రక్షాబంధన్, నూతన యజ్ఞోపవీత ధారణ ఆచరించడం ఉత్తమం అని తెలిపారు. గురువారం ఉదయం 6-8 మధ్యలో ఈ కార్యక్రమాన్ని ఆచరించడం శ్రేయస్కరమని చిలకమర్తి తెలియచేశారు. శ్రావణ పూర్ణిమ అంటే “రక్ష కట్టుకోవడం ఒకటే కాదు...దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే అన్నారు. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం అని తెలిపారు.
రక్ష అనే కంకణ ధారణే రక్షాబంధనం
మనిషికి ప్రధానమైనది జ్ఞానం...జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు...శాస్తాలకు మూలం వేదం. ఆ వేదాన్ని లోకానికి అందించిన అవతారం “హయగ్రీవ” అవతారం. జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికీ రక్ష ఆ కంకణ ధారణ అనేదే రక్షాబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆ తరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్చకం, చందస్సు, జ్యోతిష్యం అనే షడ్డంగములను అధ్యయనం చేస్తారు. భగవంతుడు ఈ లోకంపై ఉండే కరుణ చేత నామరూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామరూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని ఉపదేశం చేశారు. అయితే వేదం అనేది జ్ఞానం... అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చి పెడుతుంది, అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది. బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్న అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయారు ఎన్నో సార్లు. భగవంతుడు తిరిగి ఒక్కో రూపాన్ని ధరిస్తూ.. వేదాన్ని ఉపదేం చేసేవారు.
శ్రావణ పూర్ణిమ నాడు వేదం ఉపదేశం
మత్స్యావతారం, హంసావతారం బ్రహ్మకు వేదాన్ని ఇవ్వడానికి భగవంతుడు ధరించిన అవతారాలే. శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ రూపంలో ఉపదేశం చేసి చూశాడు భగవంతుడు.. అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు. మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు. అందుకే “ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః” చాలాకాలంగా చేసిన ఆచారాలే ధర్మములు అవి మనల్ని రక్షించేవి కనుక వాటిని చెప్పేవి శాస్త్రాలయ్యాయి. శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు. బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజ స్వామి సన్నిదానంలో చేసిన హోమం నుంచి....శ్రావణ పూర్ణిమనాడు భగంతుడు “గుజ్జపుమెడ” కలిగిన ఆకృతిలో వచ్చి...గుజ్జం “సకిలింత” ధ్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేశారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.