Simha Rasi 2024: సింహరాశి నూతన సంవత్సర రాశి ఫలాలు.. మీ ప్రేమ చిగురిస్తుంది
Simha Rasi 2024: సింహ రాశి వారికి 2024 కొత్త సంవత్సరంలో ప్రేమ చిగురిస్తుందని, అయితే వీరు గొడవలకు దూరంగా ఉండాలని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. సింహ రాశి 2024 రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
2024వ సంవత్సరం సింహరాశి వారికి కళత్ర స్థానములో శని సంచారం మరియు భాగ్య మరియు రాజ్య స్థానములో గురుని సంచారం వలన అనుకూల ఫలితాలు కలుగుచున్నవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. సింహరాశికి 2024 ప్రథమార్థంలో గురుని అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సత్ ఫలితాలు కలుగును. ద్వితీయార్థంలో రాజ్య స్థానములో గురుని ప్రభావం చేత మధ్యస్థ ఫలితాలు కలుగుతున్నాయి. సింహరాశివారికి 2024లో వాక్ స్థానములో కేతువు ప్రభావం చేత దూకుడు స్వభావానికి, గొడవలకు దూరంగా ఉండాలని సూచన.
అష్టమ రాహువు ప్రభావంచేత అరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల యందు సింహ రాశి వారు జాగ్రత్తలు వహించడం మంచిది. సింహ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలించును. వ్యాపారస్తులకు 2024 వ్యాపారాభివృద్ధి కలుగును. రైతాంగానికి మధ్యస్థ ఫలితాలున్నాయి. రాజకీయ నాయకులకు 2024 కలసివచ్చును. విద్యార్థులకు 2024 అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ, కళారంగం వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చును. స్త్రీలకు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
2024 సింహరాశి ప్రేమ జీవితం
2024 సంవత్సరంలో సింహరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలించును. కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ప్రేమ జీవితం ఆనందముగా ఉండును. వాక్ స్థానములో కేతువు ప్రభావం చేత సింహరాశి వారికి జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాల విషయాలలో చికాకులు, గొడవలు వంటివి కొంత ఇబ్బంది కలిగించును. అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు, జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం సింహరాశి వారికి ఈ సంవత్సరం కలసివచ్చును.
2024 సింహరాశి ఆర్థిక విషయాలు
2024 సంవత్సరం సింహ రాశివారికి ఆర్థికపరముగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఆర్థికపరముగా ఈ సంవత్సరం కలసివచ్చును. ధనలాభము, వస్తులాభము వంటివి కలుగును. ఆర్థికపరముగా 2024 సింహరాశి వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధిని కలిగించును. వ్యాపారస్తులకు ఆర్ధికపరమైనటువంటి లాభాలు చేకూర్చును. రైతాంగం వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును.
2024 సింహ రాశి కెరీర్
సింహ రాశి వారికి 2024 సంవత్సరం కెరీర్‌పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగ ప్రయత్నాలు సత్ ఫలితాలనిచ్చును. ఉద్యోగస్తులకు ఉద్యోగంనందు ప్రమోషన్లు వంటివి కలసివచ్చును. కెరీర్‌పరంగా 2024లో సింహరాశి వారికి సత్ ఫలితాలు కలిగించు సంవత్సరం. గురుని యొక్క అనుకూల ప్రభావంచేత 2024లో శుభఫలితాలు కలుగు సూచన.
2024 సింహరాశి ఆరోగ్యం
2024 సంవత్సరం సింహరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. అష్టమ రాహువు ప్రభావం చేత సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు వేధించు సూచన. గొడవలకు, అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్ వంటి రోగములు కొంత ఇబ్బంది పెట్టు సూచనలు అధికముగా ఉన్నాయి.
2024 సింహ రాశి పరిహారాలు
ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు ఈ సంవత్సరం లలితాదేవిని పూజించడం మంచిది. దుర్గాష్టకం వంటివి పఠించండి. సింహరాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, దేవి ఖడ్గమాల, దుర్గాష్టకం వంటివి పఠించడం మేలు చేస్తుంది.
శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.