Shani trayodashi 2023: శని త్రయోదశి రోజున ఈ రాశుల వారు పరిహారం చేసుకోవాలి
Shani trayodashi 2023: శని త్రయోదశి 04-03-2023 శనివారం రోజు వస్తోంది. శనిత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేసుకోవడం మంచిదని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శని త్రయోదశి రోజున చేయాల్సినవి, చేయకూడనివి వివరించారు.
శని త్రయోదశి మార్చి నాలుగో తేదీ శనివారం రోజున వస్తోంది. శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేయాలని, నవగ్రహ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేసుకోవాలని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ సూచించారు.
శని త్రయోదశి రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించిన వారికి శని దోషాలు తొలగుతాయి. 2023వ సంవత్సరంలో శని కుంభరాశిలో సంచరించుట వలన శనికి తైలాభిషేకం ఈ రాశులు వారు ఆచరించాలి. మకర, కుంభ, మీన రాశుల వారు (ఏలినాటి శని ప్రభావం వలన), కర్కాటక రాశి వారు (అష్టమశని ప్రభావం వలన), వృశ్చిక రాశి వారు (అర్ధాష్టమ శని ప్రభావం వలన) శనికి తైలాభిషేకం చేయించుకోవడం వలన శని దోషాలు తొలగుతాయి. శని త్రయోదశి రోజు మందపల్లి, శని సింగపూర్, తిరునాల్లారు వంటి క్షేత్రాలను దర్శించడం మంచిది.
త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు చెబుతారు.
శని జన్మించిన తిథి కూడా త్రయోదశి. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈరోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
శనివారం నాడు శ్రీమహాలక్ష్మి, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఆ రోజు అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి.
శని బాధలు తీరేందుకు చేయాల్సిన స్తోత్రం
‘నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్..
ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్’
అనే శ్లోకాన్ని పఠిస్తే మంచిదని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శని త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలు
శనిత్రయోదశి రోజు పాటించవలసిన ముఖ్య నియమాలు ఏమిటంటే... ఈ రోజున ఉపవాసం ఉండటం మంచిది. శని శాంతి పూజలు ఈ శనిత్రయోదశి నాడు చేయించడం వలన అర్థాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగుతాయి.
1. శనికి నువ్వులనూనెతో అభిషేకం చేయాలి.
2. నల్లని వస్త్రాలను ధరించడం లేదా దానం చేయడం రెండూ మంచిదే.
3. కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, ఒక గుప్పెడు బొగ్గులు, ఏడంగుళాల నల్లని రిబ్బను, ఎనిమిది ఇనుప చీలలు (మేకులు/మొలలు), కొన్ని నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
4. లేదా పారే నదిలో విడిచిపెట్టాలి.
5. కాకికి ఆహారాన్ని పెట్టాలి.
6. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చేయాలి.
శని త్రయోదశి రోజున చేయకూడనివి
శనిత్రయోదశి నాడు నూనె గానీ, గొడుగు కానీ, నువ్వులను, నవధాన్యాలను కానీ కొనరాదు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్