Krittika nakshtram: ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాటల పుట్ట- వీరితో వాదించి గెలవడం చాలా కష్టం
Krittika nakshtram: కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాటల పుట్టగా ఉంటారు. వీరికి ఏదైనా కావాలని అనుకుంటే అందుకోసం మాటలతోనే చిన్నపాటి యుద్ధం చేసేస్తారు. వీరితో వాదించి గెలవడం చాలా కష్టం. ఇలాంటి వారికి ఎలాంటి ఉద్యోగాలు నప్పుతాయో తెలుసా?
Krittika nakshtram: ఇరవై ఏడు నక్షత్రాలలో మూడవది కృత్తిక నక్షత్రం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ ముహూర్తానికి కూడా కృత్తిక నక్షత్రం పనికిరాదని చెబుతారు. ఈ నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు అయితే పాలక గ్రహం సూర్యుడు. మేష రాశిలో మొదటి పాదం, వృషభ రాశిలో రెండు, మూడు, నాలుగు పాదాలు ఉంటాయి.
ఇతర నక్షత్రాలలో పుట్టిన వారితో పోలిస్తే కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా విలక్షణంగా ఉంటారట. వీరిలో అన్ని లక్షణాలు కనిపిస్తాయి. లోభం, రజో గుణం కూడా ఉన్నాయి. అయితే మాటల పుట్ట అనవచ్చు. ఎక్కువగా ఆడంబరాలకు పోతారు. ఎవరితోనైనా వాదనకు దిగితే వీరిని నోటి అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. చాలా మొండిగా ఉంటారు. వీరిని విమర్శిస్తే అసలు తట్టుకోలేరు.
వ్యక్తిత్వం
కృత్తిక నక్షత్రం మేష రాశిలో పుట్టిన వారి లక్షణాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. మేష రాశికి అధిపతి అంగారకుడు. చాలా చురుకుగా ఉంటూ అందరితో కలిసిపోతారు. నాయకత్వ లక్షణాలు దిట్టంగా ఉన్నాయి. తమకు ఏదైనా కావాల్సి వస్తే వాదించి ఎదుటి వారిని ఓడించి ఒప్పించి సాధించుకోవడంలో ప్రావీణ్యులు. పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది. కాస్త దూకుడు స్వభావం ఉండటం వల్ల కొన్ని సార్లు చిక్కుల్లో పడతారు. వీరిలో ఉన్న నెగటివ్ విషయం ఏమిటంటే వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
అదే వృషభ రాశిలో పుట్టినట్టయితే వీరి గుణాలు మరింత భిన్నంగా ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. దయా హృదయం కలిగి ఉంటారు. మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు. ఒక్కసారి వీరి నమ్మకాన్ని గెలుచుకున్నారంటే ప్రాణం పోయేవరకు విడిచిపెట్టరు. వారికోసం ఎంతటి సాహసమైన చేస్తారు. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పట్ల చాలా కఠినంగా ఉంటారు.
ఉద్యోగం
ఈ నక్షత్రంలో జన్మించిన వారిపై మూడు గ్రహాల ప్రభావం కనిపిస్తుంది. సూర్యుడు, శుక్రుడు, అంగారకుడి ప్రభావం వీరి జీవితం మీద ఉంటుంది. వీరికి పోలీసు, రక్షణ సేవలు, వైద్యం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఉద్యోగాలు చక్కగా సరిపోతాయి. ఏదైనా పని మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. పని పట్ల చాలా నిజాయితీగా విధేయతగా ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు పట్టుదలగా ఉంటారు. తిండి మీద వీరికి ధ్యాస ఎక్కువ. భోజన ప్రియులు. అది మాత్రమే కాదు ప్రయాణాలంటే ముందుంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బుధ, శుక్ర, శని వారాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజుల్లో ఏ పని మొదలుపెట్టిన అది విజయవంతం అవుతుంది.
ఆరోగ్యం
ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు ఎక్కువగా బాధిస్తాయి.
టాపిక్