చాతుర్మాస్య దీక్ష, వ్రత నియమాలు తెలుసా? ఈ దీక్ష మన ఆరోగ్య సంరక్షణకే-know significance of chaturmasya vratham puja vidhanam and health benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  చాతుర్మాస్య దీక్ష, వ్రత నియమాలు తెలుసా? ఈ దీక్ష మన ఆరోగ్య సంరక్షణకే

చాతుర్మాస్య దీక్ష, వ్రత నియమాలు తెలుసా? ఈ దీక్ష మన ఆరోగ్య సంరక్షణకే

HT Telugu Desk HT Telugu
Jun 29, 2023 12:35 PM IST

చాతుర్మాస్య దీక్ష, వ్రత నియమాలు తెలుసా? ఈ దీక్ష మన ఆరోగ్య సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని గుర్తించాలి.

దేవశయని ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించి తిరిగి కార్తీక శుద్ద ఏకాదశికి నిదుర లేస్తారు. ఈ కాలాన్ని చాతుర్మాస కాలం అంటారు
దేవశయని ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించి తిరిగి కార్తీక శుద్ద ఏకాదశికి నిదుర లేస్తారు. ఈ కాలాన్ని చాతుర్మాస కాలం అంటారు

చాతుర్మాస్య దీక్ష, ఈ కాలంలో ఉండే వాతావరణం, మన ఆరోగ్యం.. వీటన్నింటికీ అవినాభావ సంబంధం ఉంది. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు మాసాలు ఆచరింంచాల్సిన వ్రతం. పాప ప్రక్షాళనకు ఈ వ్రతం ఆచరిస్తారు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజు ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది. ఈకాలంలోనే విష్ణుమూర్తి పాల సముద్రంలో శయనిస్తాడు. అందుకే ఈ రోజును దేవశయని ఏకాదశి అని కూడా అంటారు.

ఈ చాతుర్మాస్య సమయం అంతా వర్షాకాలం. వ్యాధులు సంక్రమించే కాలం. ఈ వ్రతం ఆచరించడం ఆరోగ్య సంరక్షణ కోసం కూడా అని గమనించాలి. ఈ వ్రత నియమాల్లో భాగంగా కొన్ని ఆహారాలను వదిలేయాల్సి ఉంటుంది.

చాతుర్మాస్యంలో అనుసరించాల్సిన ఆహార నియమాలు

ముఖ్యంగా ఆకు కూరలు, పెరుగు, పాలు, పప్పు వంటివాటిని స్వీకరించరాదు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆకు కూరలు, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వయుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు తినరాదు. అలాగే వెల్లుల్లి, టమాట, సొరకాయ తినకూడదదు. వంట కోసం ఆవనూనె వాడకూడదు.

చాతుర్మాస్య వ్రత నియమాలు

నాలుగు నెలలు తాము నివసించే ప్రాంత హద్దులు దాటి బయటకు వెళ్లరాదు. అంటే గ్రామ పొలిమేర దాటకూడదు. ఈ నియమం కఠినంగా కనిపిస్తున్నా.. అంటువ్యాధులను అరికట్టడానికి ఇలాంటి నియమాలు ఉపయోగపడేవని చెబుతారు. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ఇలాంటి ఆంక్షలే అమల్లోకి తెచ్చారని గమనించాలి.

ఇక చాతుర్మాస్య వ్రతంలో భాగంగా ఉదయాన్నే స్నానం చేయాలి. క్షురకర్మలు చేయరాదు. నాలుగు నెలలు బ్రహ్మచర్యం పాటించాలి. రోజూ ఒకే పూట భోజనం చేయాలి. ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండాలి. నేలపై నిదురించాలి. అహింస పాటించాలి. యోగాభ్యాసం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇష్టదేవతల అష్టోత్తర శత, సహస్ర నామావళి పారాయణం చేయాలి.

చాతుర్మాస్య వ్రతం ఆచరించే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మోక్ష ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణం చెబుతోంది.

Whats_app_banner