వ్యాపారం కలిసి రావడం లేదా? ఈ మార్పులు చేసి చూడండి లాభాల పంట పండుతుంది
వ్యాపారంలో లాభాలు అందుకోవడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా పురోగతి సాధించలేకపోతారు. మీరు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి. వ్యాపారం లాభాల బాట పడుతుంది.
కొంతమంది ఎంత కష్టపడినా వ్యాపారంలో లాభాలు రాకపోగా ఏ పని చేపట్టినా ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారంలో పుంజుకునేందుకు రాత్రింబవళ్ళు కష్టపడతారు. కానీ చాలాసార్లు విజయాన్ని సాధించలేకపోతారు. వ్యాపారం ఊపందుకోకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటి వాస్తు లోపం.
మంచి ఆదాయాన్ని సంపాదించి తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఎవరు కోరుకోరు? నష్టాలు కాకుండా లాభాలతో వ్యాపారం నడిపించుకోవాలని ఆశపడుతున్నారా? అయితే మీ దుకాణం, వ్యాపార స్థలం, ఫ్యాక్టరీ, కార్యాలయం మొదలైన వాటిలో ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి. ఇది మీ కస్టమర్‌లను మీ ఉత్పత్తి వైపు ఆకర్షిస్తుంది. మీకు లాభాలను తెస్తుంది. వ్యాపార సముదాయంలో పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాలు ఇవి. వీటిని సరిగా పాటిస్తే వ్యాపారంలో దూసుకెళ్తారు.
మీ రిటైల్ దుకాణం ప్రవేశ దిశ చాలా ముఖ్యమైనది. దీని ద్వారా మాత్రమే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఉత్తరం లేదా తూర్పు వైపు ప్రవేశాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. ప్రధాన ద్వారం ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. బాగా వెలుతురు ఉండాలి. అలాగే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండే విధంగా చూసుకోవాలి.
షాపుకు వెళ్ళగానే ముందు గది మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఉదయం దుకాణంలో శంఖం ఊదండి లేదా మొబైల్‌లో శంఖం ధ్వనిని వినండి. దుకాణానికి ఉత్తరం వైపున మట్టి కుండలో కొన్ని ఖర్జూరాలు ఉంచండి. షాప్ కౌంటర్‌లో ఫెంగ్ షూయి పిల్లిని ఉంచండి, అది నిరంతరం చేతులు ఊపుతూ ఉంటుంది.
దుకాణానికి ఈశాన్య దిశలో ఉంచిన ఇనుప తాళాలు పెడుతున్నట్టయితే వెంటనే వాటిని తొలగించండి. దుకాణం ఆగ్నేయ దిశలో ఎరుపు రంగు కుండీలను ఉంచండి. షాపులో ఉంచిన వస్తువులను ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకోండి. కుర్చీ కింద మీ కుషన్‌పై పసుపు గుడ్డను పరచి, రావి ఆకులను ఉంచండి. అవి ఎండిపోయినప్పుడు వాటిని మార్చుకుంటూ ఉండాలి.
వాస్తులో నగదు ఉంచడం కూడా ఒక ముఖ్యమైన దిశ. వాస్తు ప్రకారం ఉత్తర, ఈశాన్య, ఆగ్నేయంలో క్యాష్ కౌంటర్ ఉంచుకోవాలి. ఈ దిశ డబ్బు, సంపదను ఆకర్షిస్తాయి. ఈ స్థలంలో నగదు ఉంచడం వల్ల మీ జీవితంలో సంపద పెరుగుతుంది.
వ్యాపారం ముందుకు తీసుకెళ్లడం కోసం ఉత్తర దిశలో నీలం రంగు తామర చిత్రాన్ని ఉంచుకోవచ్చు. లేదంటే తెలుపు రంగు పిగ్గీ బ్యాంకును ఉంచుకుని అందులో రోజు కొంచెం డబ్బులు వేసుకోవడం మంచిది.
ఈశాన్య దిశలో కుంకుమతో స్వస్తిక్ చిహ్నం వేసుకోవాలి. వ్యాపారంలో పురోగతి సాధించడం కోసం ఆహారంలో మిరియాలు, పుల్లని వస్తువులు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్