Dakshinavarthi shankham: దీపావళికి దక్షిణావర్తి శంఖం తెచ్చి పూజ చేయండి చాలు- సిరిసంపదలకు లోటు ఉండదు
Dakshinavarthi shankham: దీపావళికి అనేక వస్తువులు తీసుకొచ్చి పూజ చేస్తారు. అయితే ఈ దీపావళికి ఎంతో విశిష్టమైన దక్షిణావర్తి శంఖం తీసుకొచ్చి పూజించండి. మీకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలకు లోటు ఉండదు. లక్ష్మీదేవికి ప్రతీకరమైన ఈ వస్తువులు ఇంట్లో అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి.
దీపావళి రోజు అందరూ తప్పనిసరిగా లక్ష్మీపూజ నిర్వహిస్తారు. ఈరోజు అమ్మవారిని సంతోషపెట్టి ఆశీర్వాదం పొందేందుకు అనేక రకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ దీపావళికి మీరు కూడా ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టయితే దక్షిణావర్తి శంఖం ఇంటికి తెచ్చుకోండి.
లక్ష్మీదేవికి ప్రతీకరం
క్షీరసాగర మథనం చేసేటప్పుడు లక్ష్మీదేవితో శంఖం కూడా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీదేవికి ఇది ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన కొత్తిమీర, శ్రీఫలం, ఏనుగు ప్రతిమలు వంటివి కొనుగోలు చేసి పూజలో పెడతారు. అన్నింటికంటే ఈ దక్షిణావర్తి శంఖం తీసుకొచ్చి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. దీన్ని పూజించడం వల్ల సిరిసంపదలకు లోటు ఉండదు. శంఖం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని ప్రతీతి.
దక్షిణావర్తి శంఖం చాలా విశిష్టమైనది. ఈ శంఖాన్ని రోజూ పూజించాలి. ఇందులో నీళ్ళు పోసి గంధం వేసి పువ్వులు పెట్టి దణ్ణం పెట్టుకున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నియమానుసారం ఈ శంఖాన్ని పూజిస్తే ఇంట్లోని దారిద్రం మొత్తం తొలగిపోతుందని పండితులు సూచిస్తున్నారు. అయితే శంఖం ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. మిగతా శంఖాలతో పోలిస్తే ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది.
ఎలా పూజించాలి ?
సాధారణంగా కొన్ని శంఖాలకు కుడి వైపు పొట్ట భాగంగా ఉబ్బెత్తుగా ఉంటుంది. కానీ దక్షిణావర్తి శంఖానికి మాత్రం ఎడమ వైపు పొట్ట ఎత్తుగా ఉంటుంది. ఈ శంఖాన్ని పూజించిన వారికి సమస్త సమస్యలు తొలగిపోతాయి. దీన్ని ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. శంఖం ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు.
ఒక చిన్న పీట వేసి దాని మీద వస్త్రం లేదా పళ్ళెం పెట్టి ఎరుపు వస్త్రం కప్పాలి. శంఖాన్ని నీటితో నింపి పూజలో ఉంచాలి. దీన్ని పూజించేటప్పుడు “ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః” అనే మంత్రాన్ని జపించాలి. అందులోని నీటితో దేవతకు అభిషేకం చేయాలి. తర్వాత దాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి ఎరుపు రంగు వస్త్రంలో భద్రపరచాలి. ప్రతి శుక్రవారం దీన్ని క్రమం తప్పకుండా పూజించాలి.
ఇంట్లో ఒక శంఖం మాత్రమే ఉంచుకోవాలి. దక్షిణావర్తి శంఖం ఇంట్లో ఉంటే ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. శత్రువుల నుంచి ఎటువంటి హాని ఉండదు. శత్రు భయం తొలగిపోతుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుని ఉంటుందని నమ్ముతారు. అలాగే ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు. నిత్యం శంఖాన్ని పూజించిన వారికి అష్టైశ్వర్యాలకు, సిరిసంపదలకు లోటు ఉండదు. ఇందులోని తీర్థం తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.