Bats entering house: హఠాత్తుగా గబ్బిలాలు ఇంట్లోకి వస్తే దోష నివారణ ఇలా చేయండి
Bats entering house: ఒక్కోసారి గబ్బిలం హఠాత్తుగా ఇంట్లోకి ఎగిరి వస్తుంది. అలా రావడం ఇంటికి అశుభంగా చెబుతారు.
Bats entering house: హిందూ ధర్మం ప్రకారం కొన్ని రకాల జీవులను మనం అశుభంగా భావిస్తాము. అలాంటి వాటిలో గబ్బిలం ఒకటి. దీని రంగు నలుపు. అది ఉండే ప్రదేశం కూడా నలుపుగానే ఉండాలి.. అంటే కటిక చీకట్లోనే అవి నివసిస్తాయి. హిందూ ధర్మంలో శుభకార్యాల్లో నలుపు వర్ణాన్ని నిషేధిస్తాము. కాబట్టి గబ్బిలం ఇంట్లోకి రావడాన్ని కూడా దోషంగానే చూస్తారు ఎంతోమంది అంతే కాదు గబ్బిలం ఎన్నో రకాల వైరస్‌లను, బ్యాక్టీరియాలను, దుర్వాసనను విస్తరించేలా చేస్తుంది. అందుకే గబ్బిలాన్ని ఇంటి చుట్టుపక్కల లేకుండా చూసుకుంటారు.
ఒక్కోసారి హఠాత్తుగా గబ్బిలం ఇంట్లోకి దూరి ఎగురుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటిని వెంటనే తరిమేయాలి. ఇలా ఇంట్లోకి గబ్బిలం హఠాత్తుగా వస్తే ఆ ఇంటికి మంచిది కాదు. ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని చెబుతారు. అలాగే ఇంట్లోని వారి జీవితంలో ఇబ్బందులు కలుగుతాయని, వారి ఆరోగ్యం క్షీణిస్తుందని అంటారు. అలాగే వారి కుటుంబంలో ఏదైనా మరణ వార్త వినాల్సి రావచ్చని కూడా చెబుతారు. గబ్బిలాలు దెయ్యాల మాదిరిగా తలకిందులుగా వేలాడతాయి. అందుకే వీటిని అశుభ జంతువులుగా పరిగణిస్తారు. గబ్బిలం ఇంట్లోకి వచ్చిన వెంటనే పరిహారాలు చేయడం చాలా అవసరం. గబ్బిలం ఇంట్లోకి వచ్చిన రోజు ఎలాంటి చెడు వాక్యాలు, పదాలు, మాటలు మీ నోట్లోంచి రాకూడదు.
గబ్బిలం వెళ్లిపోయాక...
గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్లిపోయిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తడి గుడ్డ పెట్టి తుడుచుకోవాలి. పసుపు నీళ్లు జల్లుకోవాలి. సాంబ్రాణి ధూపం పొగను వేసి ఇల్లంతా ధూపంతో నింపేయాలి. ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఎలాంటి పేదరికము, అనర్ధాలు జరగకుండా కాపాడమని ఆరాధించాలి. వీలైతే ఏదైనా గృహ శాంతి చేయించుకోవడం కూడా మంచిది. తులసి మొక్కకు నీళ్లు పోయాలి. దగ్గరలో నది ఉంటే ఆ నది నీళ్లు తెచ్చి పసుపు కలిపి ఇల్లంతా చల్లుకోవాలి. నది లేనప్పుడు ఇంట్లో నీరుతోనే చల్లుకొని శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం.
గబ్బిలాలకు హాని కలిగించే శక్తి ఉంటుందని చెబుతారు. వాటి చూపు మానవుని మీద పడినా చాలు... చర్మవ్యాధులు వస్తాయని అంటారు. గబ్బిలాలు రాబిస్ వంటి వ్యాధులను కలిగిస్తాయి. మనుషులను అవి తాకుకుంటూ వెళ్లినా కూడా ఈ రాబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
గబ్బిలాలు ఇంట్లోకి రాత్రిపూట...
గబ్బిలాలు రాత్రిపూట ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు పగలు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో ఇంట్లో లైట్లు ఆపేసి ఉండడం మంచిది. ఎందుకంటే అవి చీకటిలోనే ఎకోలొకేషన్ ఉపయోగించి నావిగేట్ చేస్తాయి. లైట్లు ఆఫ్ చేయడం వల్ల అది ఎటువైపు నుంచి వెళ్లిపోవాలో బాగా గుర్తించగలవు. లైట్లు వేసి ఉంటే సరిగా గుర్తించలేక ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లోకి గబ్బిలం రాగానే ముందు లైట్లు అన్ని ఆపి చీకటిగా చేయండి. అది బయటికి వెళ్లిపోతుంది. సాధారణంగా గబ్బిలాలు మనల్ని చూసి ఎక్కువగా భయపడతాయి. కాబట్టి మనం వాటికి భయపడటం మానేయాలి.
అంతేకాదు ఇంట్లో ఉన్న సాలెగూడును తొలగించండి. ఇది కూడా ఇంట్లో శుభ సూచకం కాదు. అలాగే ఇంట్లో మొక్కలు పెంచుతున్నట్లయితే ఆ మొక్కలకు ఉన్న ఎండిన ఆకులను కత్తిరించి... ఎప్పటికప్పుడు బయట పడేస్తూ ఉండండి.