ఆ నిర్ణయంపై పునరాలోచించాలన్న యడ్యూరప్ప-yediyurappa asks karnataka cm to reconsider decision ,national న్యూస్
తెలుగు న్యూస్  /  national  /  ఆ నిర్ణయంపై పునరాలోచించాలన్న యడ్యూరప్ప

ఆ నిర్ణయంపై పునరాలోచించాలన్న యడ్యూరప్ప

HT Telugu Desk HT Telugu
Apr 25, 2022 11:23 AM IST

శివమొగ్గ విమానాశ్రయానికి తన పేరు పెట్టాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచన చేయాలని మాజీసీఎం యడ్యూరప్ప లేఖ రాశారు. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నిర్ణయం తన హృదయాన్ని తాకిందని అయితే తనకంటే రాష్ట్రానికి సేవ చేసిన మహనీయులు చాలామంది ఉన్నందున విమానాశ్రయానికి పేరు పెట్టాలనే విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

<p>కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప</p>
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప (HT_PRINT)

బీజేపీ సీనియర్‌ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శివమొగ్గలో నిర్మించనున్న విమనాశ్రాయానికి తన పేరుపెట్టాలనే నిర్ణయంపై స్పందించారు. ఈ నెల 20న శివమొగ్గలోని సొగానేలో జరుగుతున్న విమానాశ్రయ నిర్మాణ పనుల్ని పరిశీలించడానికి వెళ్లిన బొమ్మై, దానికి మాజీ సీఎం యడ్యూరప్ప పేరు పెట్టాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానాయాన శాఖ లేఖ రాస్తానని ప్రకటించారు. దీంతో ఆదివారం బొమ్మైకు యడ్యూరప్ప సీఎం బొమ్మైకు లేఖ రాశారు. బొమ్మై నిర్ణయం తన హృదయాన్ని తాకిందని, తన తదనంతరం విమానాశ్రయానికి పేరుపెట్టాలనే ప్రతిపాదనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కర్ణాటకలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారని, రాష్ట్రానికి వారు చేసిన సేవల్ని దృష్టిలో ఉంచుకుని, వారికి నివాళులు అర్పించేలా పేర్లను కేంద్రానికి సూచించాలని కోరారు.

బీజేపీ సీనియర్‌ నాయకుడు యడ్యూరప్ప పేరును శివమొగ్గ విమానాశ్రయానికి పెట్టాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో యడ్యూరప్ప లేఖ రాసినట్లు తెలుస్తోంది. బీజేపీలో బలమైన నాయకుడైన యడ్యూరప్ప పేరును పెట్టడంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. శివమొగ్గ జిల్లా నుంచి రాష్ట్రానికి సేవ చేసిన వారి పేర్లను పెట్టాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. 

యడ్యూరప్ప రాజకీయ జీవితం కూడా శివమొగ్గతోనే మడిపడి ఉంది. జిల్లాలోని షికారిపుర నియోజకం వర్గం నుంచి ఆ‍యన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు బి.వై. రాఘవేంద్ర శివమొగ్గ నుంచి లోక్‌సభ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివమొగ్గ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు కేటాయించడంపై యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. బొమ్మైతో పాటు ఇతర నేతలకు కూడా యడ్యూరప్ప కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక అభివృద్ధి కోసం కృషి చేసిన వారిలో పలువురు ఉద్దండులు ఉన్నారని వారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని యడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. వారు చేసిన కృషితో తాను చేసింది చాలా స్వల్పమని లేఖలో పేర్కొన్నారు.

శివమొగ్గలో నిర్మిస్తోన్న విమానాశ్రయంలో బెంగుళూరు కెంపేగౌడ విమానాశ్రయం తర్వాత పొడవైన రన్‌వేను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో శివమొగ్గ విమానాశ్రాయ నిర్మాణాన్ని చేపట్టారు.

Whats_app_banner

టాపిక్