rajyasabha elections | `ఐ ల‌వ్ ఇట్‌`.. అందుకే ఓటేశా!-rs polls kumaraswamy alleges horse trading bid in karnataka claims siddaramaiah in touch with jd s mlas ,national న్యూస్
తెలుగు న్యూస్  /  national  /  Rajyasabha Elections | `ఐ ల‌వ్ ఇట్‌`.. అందుకే ఓటేశా!

rajyasabha elections | `ఐ ల‌వ్ ఇట్‌`.. అందుకే ఓటేశా!

HT Telugu Desk HT Telugu
Jun 10, 2022 03:58 PM IST

క‌ర్నాట‌క‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. క్రాస్ ఓటింగ్ బ‌హిరంగంగానే జ‌రుగుతోంది. త‌మ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఓటేశార‌ని జేడీఎస్ నేత కుమార‌స్వామి ఆరోపించారు.

జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ
జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ

క‌ర్నాట‌క‌లో నాలుగు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. అందులో రెండు స్థానాలను, త‌మ‌కున్న ఎమ్మెల్యేల బ‌లంతో బీజేపీ క‌చ్చితంగా గెలుచుకుంటుంది. ఒక స్థానాన్ని 70 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ గెలుచుకుంటుంది. మ‌రో స్థానంపైనే ఉత్కంఠ నెల‌కొంది.

కాంగ్రెస్ అంటే నాకు ప్రేమ‌

ఈ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఓటు వేశాన‌ని జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ బ‌హిరంగంగానే చెప్పారు. `అవును. కాంగ్రెస్‌కు ఓటేశాను. ఎందుకంటే ఐ ల‌వ్ ఇట్‌` అని ఓటేసి వ‌చ్చిన అనంత‌రం ఆయ‌న వ్యాఖ్యానించారు. జేడీ ఎస్‌కు చెందిన మ‌రో ఎమ్మెల్యే ఎస్ ఆర్ శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేసిన‌ట్లు స‌మాచారం. ఈ క్రాస్ ఓటింగ్‌పై జేడీఎస్ నేత‌, మాజీ సీఎం కుమార స్వామి మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేత సిద్ధ రామ‌య్య కుట్ర చేసి, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను క్రాస్ ఓటింగ్‌కు పురిగొల్పుతున్నాడ‌ని ఆరోపించారు.

బ‌హిరంగంగానే లేఖ రాశారు

జేడీఎస్ నేత‌ల‌కు కాంగ్రెస్ నేత సిద్ధ రామ‌య్య బ‌హిరంగంగానే లేఖ రాశార‌ని, అది త‌న ట్విట‌ర్‌లో కూడా పోస్ట్ చేశార‌ని కుమార‌స్వామి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రెండో అభ్య‌ర్థి మ‌న్సూర్ అలీ ఖాన్‌కు మ‌ద్ద‌తుగా ఆత్మ‌సాక్షిగా ఓటేయాల‌ని కోరుతూ జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు సిద్ద‌రామ‌య్య లేఖ రాశార‌న్నారు. ఇప్పుడు అలాంటి లెట‌ర్ ఏదీ తాను రాయ‌లేద‌ని బుకాయిస్తున్నార‌ని, ఇది ఆయ‌న రెండు నాల్క‌ల ధోర‌ణికి నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కుమార స్వామి ఆరోపించారు. కాంగ్రెస్ వ‌ల్ల‌నే బీజేపీ దేశంలో బ‌ల‌ప‌డుతోంద‌న్నారు.

నాలుగు స్థానాలు.. ఆరుగురు అభ్య‌ర్థులు

క‌ర్నాట‌క‌లో నాలుగు రాజ్య‌స‌భ‌ స్థానాల‌కు గానూ ఆరుగురు అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. 244 ఎమ్మెల్యేల అసెంబ్లీలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేలు సొంతంగా ఉన్నారు. అంటే, రెండు స్థానాల‌ను బీజేపీ సునాయాసంగా గెలుచుకోగ‌ల‌దు. 70 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మూడో సీటును కైవ‌సం చేసుకోగ‌ల‌దు. నాలుగో స్థానంపైన‌నే ఉత్కంఠ నెల‌కొంది. ఈ స్థానం కోసం ప్ర‌ధానంగా కాంగ్రెస్‌, బీజేపీ పోటీ ప‌డుతున్నాయి. జేడీఎస్ కూడా బ‌రిలో ఉంది. తన అభ్య‌ర్థిగా క్రుపేంద‌ర్ రెడ్డిని జేడీఎస్ నిల‌బెట్టింది. కాంగ్రెస్ ఎలాగూ ఈ స్థానాన్ని గెల‌వ‌లేద‌ని, జేడీఎస్ గెల‌వ‌కుండా, బీజేపీని గెలిపించ‌డానికి క్రాస్ ఓటింగ్‌కు కుట్ర ప‌న్నింద‌ని జేడీఎస్ నేత కుమార‌స్వామి ఆరోపిస్తున్నారు.

WhatsApp channel