ఎన్నికల విరాళాలన్ని చేరేది అక్కడికే
రాజకీయ పార్టీలకు విరాళాలు అందిస్తున్న వాటిలో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న సంస్థలతో పాటు భారీ ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సంస్థలు కూడా ఉండటం వెలుగు చూసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ అధ్యయనంలో కార్పొరేట్ల నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు సాగుతున్న వైనాన్ని వెల్లడించింది.
ఎలక్ట్రోరల్ ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు చేరిన నిధులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు అందాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను అందిన నివేదికల్ని పరిశీలించిన తర్వాత ఏడిఆర్ సంస్థ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులతో పాటు, కేంద్ర,రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ ఎలక్ట్రోరల్ ట్రస్టులకు విరాళాలిచ్చిన టాప్-3 సంస్థల్లో ఒకటిగా నిలిచింది. మెగా సంస్థ ప్రూడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్టుకు ఇచ్చిన విరాళాల్లో అధిక భాగం బీజేపీకి చేరాయి.
మెగా సంస్థ ఇచ్చిన 22కోట్ల విరాళం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రూడెంట్ సంస్థ అందచేసింది. ప్రూడెంట్ సంస్థకు తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 24.5259 కోట్ల రుపాయల విరాళాలు అందాయి. ఇందులో మెగా సంస్థ రెండు విడతల్లో 22కోట్లను విరాళమిచ్చింది. 2020 అక్టోబర్ 16న 20కోట్లు, 2020 అక్టోబర్ 23న 2కోట్ల రుపాయల విరాళం ప్రూడెంట్‌కు మెగా సంస్థ నుంచి ముట్టాయి. ప్రూడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు కోయంబత్తూరుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ సంస్థ నుంచి రూ.100కోట్ల రుపాయలు విరాళం స్వీకరించింది.
పారదర్శకత కోసం....
రాజకీయ పార్టీలు స్వీకరించే విరాళాల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు 2013లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎలక్ట్రోరల్ ట్రస్టుల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. రాజకీయ పార్టీలకు సంస్థలు, కంపెనీలు ఇచ్చే విరాళాలను పారదర్శకంగా చూపేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రోరల్ ట్రస్టులను కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వాటి ద్వారా పార్టీలకు విరాళాలు అందిస్తుంటారు. ఎన్జీవోలుగా నమోదయ్యే ఎలక్ట్రోరల్ ట్రస్టులకు విరాళాలను స్వీకరించి రాజకీయ పార్టీలకు బదిలీ చేసే అవకాశం కల్పించారు. దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు రాజకీయ పార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు అనుసరించే విధానాల్లో ఒకటిగా రూపాంతరం చెందింది.
ఒకే కంపెనీ రూ.100కోట్ల విరాళం...
2020-21 ఆర్ధిక సంవత్సరాలకు గాను పార్టీలకు అందిన విరాళాలను విశ్లేషించిన ఏడిఆర్ సంస్థ ఒకే సంస్థ 100కోట్ల రుపాయల భారీ విరాళం ఇవ్వడాన్ని గుర్తించింది. దాని తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన హల్దియా ఇంజినీరింగ్ సంస్థ 25కోట్లు, హైదరాబాద్‌కు చెందిన మెగా సంస్థ 22కోట్లు విరాళమిచ్చినట్లు గుర్తించారు. మొదటి పది స్థానాల్లో ఉన్న దాతలు దాదాపు 223కోట్ల రుపాయలను ఎలక్ట్రోరల్ ట్రస్టులకు విరాళంగా ఇచ్చాయి. ట్రస్టుల వద్ద ఉన్న మొత్తం విరాళాల్లో ఇది 86.27శాతానికి సమానం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎలక్ట్రోరల్ ట్రస్టులు అందుకునే విరాళాల్లో 95శాతం నిధుల్ని అదే ఆర్దిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు బదిలీ చేయాలి. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ట్రస్టుల వద్ద ఉన్న నిల్వల్ని కూడా కలిపి 5శాతం కంటే ఎక్కువ మిగలకుండా పార్టీలకు ఇచ్చేయాలి.
భారీగా నిధుల ప్రవాహం
దేశంలో గుర్తింపు పొందిన ఏడు ఎలక్ట్రోరల్ ట్రస్టులు 2020-21లో మొత్తం 258.4915కోట్ల రుపాయలు విరాళాలను సేకరించాయి. అందులో 99.97శాతం నిధుల్ని 258.43కోట్లను పార్టీలకు పంచిపెట్టాయి. ఈ మొత్తంలో ప్రూడెంట్ సంస్థకు కార్పొరేట్లతో పాటు వ్యక్తిగత విరాళాల ద్వారా 245.70కోట్ల రుపాయలు సమకూరితే అందులో రూ.209కోట్లు బీజేపీకి చేరాయి. ఆ తర్వాత జయభారత్ ట్రస్టు ద్వారా మరో 2కోట్లు బీజేపీకి దక్కాయి. మిగిలిన మొత్తాలను వివిధ రాజకీయ పార్టీలకు పంచిపెట్టారు.
విరాళమిచ్చినా తప్పని వేటు
విచిత్రం ఏమిటంటే భారీ విరాళం ఇచ్చిన తమిళనాడు కంపెనీ ఆస్తుల్ని ఈ ఏడాది ఏప్రిల్ 2న కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థకు 8 ప్రాంతాల్లో ఉన్న 409.92 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది.
టాపిక్