Election Results 2022 |ఓట్లలెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి...ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు...
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ ఎన్నికల సమరంలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మరికొద్ది గంటల్లో మొదలుకాబోతున్నది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపును ఎన్నికల కమీషన్ ప్రారంభించబోతున్నది. ఈ ఎన్నికల సంగ్రామంలో అగ్రనాయకులు భవితవ్యం ఎలా ఉందో..ఎవరు విజేతలుగా నిలవనున్నారనేది దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మొత్తం 690 శాసనసభ స్థానాలకు గాను ఫిబ్రవరి 14 నుంచి మార్చి 7వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఉత్తప్రదేశ్ ఫలితాలపైనే ఉంది. యూపీలో బీజేపీనే స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మరోసారి యోగి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్‌పీ లు ఓటర్లను ఆకర్షించలేకపోయినట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
పంజాబ్ లో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) విజయకేతనం ఎగురవేయనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వారసుడిగా ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మణిపూర్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఉత్తరాఖండ్, గోవాలో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
ఓట్ల లెక్కింపులో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమీషన్ తెలిపింది. కౌంటింగ్ సెంటర్స్ వద్ద పరిస్థితులను 24 గంటలు సీసీటీవీ ద్వారా పర్యవేక్షించనున్నారు. తప్పుడు ప్రచారాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యల్ని పాటించారు. ఈ ఎన్నికల సమరంలో ఎవరూ విజేతలుగా నిలుస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.