Afghanistan earthquake | 1000 మంది దుర్మరణం
అఫ్గానిస్తాన్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రకృతి విలయంలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది.
ఆకలి, అంతర్యుద్ధం, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నఅఫ్గానిస్తాన్‌లో భూకంపం మారణహోమం సృష్టించింది. అత్యంత తీవ్రమైన భూకంపం ధాటికి ఆగ్నేయ అఫ్గానిస్తాన్ వణికిపోయింది. భవనాలు కుప్పకూలాయి. దాదాపు వేయి ప్రాణాలు పోయాయి. ఇప్పటికీ, ఇంకా ఎంతోమంది శిధిలాల కింద ఉండొచ్చని భావిస్తున్నారు.
అర్ధరాత్రి విధ్వంసం
మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆగ్నేయ అఫ్గానిస్తాన్‌పై భూకంపం విరుచుకుపడింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో విధ్వంసం సృష్టించింది. ఈ ప్రకృతి విలయంలో ఇప్పటివరకు 1000 మంది చనిపోయినట్లు అఫ్గాన్ ప్రకృతి విపత్తుల మంత్రి షరీఫుద్దీన్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్నారు. 1500 మందికి పైగా గాయపడ్డారని, అంచనా వేయలేనంతగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, హెలీకాప్టర్ల ద్వారా సహాయ సామగ్రిని అందిస్తున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ సరిహద్దులోని ఖోస్త్, నాన్‌ఘడ్ ప్రాంతాల్లోనూ భూకంప ప్రకంపనలు కనిపించాయి.
గత 8 ఏళ్లలో ఇదే భారీ ప్రకృతి విపత్తు
గత 8 ఏళ్లలో అఫ్గానిస్తాన్ లో ఇదే భారీ ప్రకృతి విపత్తు. 2014లో బడాక్షాన్ రాష్ట్రంలో కొండ చరియలు విరిగి పడిన ప్రమాదంలో 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంప విపత్తు నుంచి తేరుకోవడానికి సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అఫ్గానిస్తాన్ ప్రభుత్వం కోరుతోంది. లక్షలాది భూకంప బాధితులు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. బాధితులకు తక్షణ సాయం అందించడానికి అఫ్గాన్ ప్రభుత్వం 10 కోట్ల అఫ్గానీ(అఫ్గానిస్తాన్ కరెన్సీ)లను విడుదల చేసింది. తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంతర్జాతీయంగా అఫ్గాన్‌కు లభించే ఆర్థిక సాయం కూడా నిలిచిపోయింది.
టాపిక్