Maharashtra wine policy | 'వైన్ అంటే మద్యం కాదు.. రైతుల కోసమే ఆ నిర్ణయం'
Sanjay Raut news today | సూపర్మార్కెట్లలో వైన్ విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన శివసేన నేత సంజయ్ రౌత్.. ‘వైన్ అంటే మద్యం కాదు.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాము,’ అని వివరించారు.
Maharashtra wine news | సూపర్మార్కెట్లలో వైన్‌ను విక్రయించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ సమర్థించారు. వైన్ అంటే మద్యం కాదని, ఈ విషయంపై విపక్షాలు అనవసరమైన హడావుడి చేస్తున్నాయని మండిపడ్డారు. మహారాష్ట్రను 'మద్యం'రాష్ట్రగా మారనివ్వమని బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ విధంగా స్పందించారు.
"వైన్ అంటే మద్యం కాదు. రాష్ట్రంలో వైన్ అమ్మకాలు పెరిగితే.. రైతులకే లాభం. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. ప్రతి విషయాన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఆ పార్టీకి రైతుల సంక్షేమం అనవసరం," అని సంజయ్ రౌత్ అన్నారు.
కేబినెట్ ఆమోదంతో..
సూపర్మార్కెట్లు, వాక్-ఇన్ స్టోర్లలో వైన్‌ను విక్రయించే ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ. 5వేల వార్షిక లెసెన్స్ రుసుముతో ఆయా దుకాణాలకు అనుమతులు మంజూరు చేసింది. వైన్ ప్రియులకు సులభంగా అందుబాటులో ఉండేందుకు, పరిశ్రమ మెరుగుపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
ఇదే విషయంపై దేవంద్ర ఫడణవీస్ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యల కన్నా వైన్ వ్యవహారమే ముఖ్యమని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రను 'మద్య'రాష్ట్రగా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, తాము కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.