Wayanad Tragedy : రియల్ ఎస్టేట్ దురాశ, ప్రైవేట్ టూరిజం.. వాయనాడ్ విపత్తుకు కారణమా?
Wayanad Landslides Reasons : దేశం మెుత్తం ఇప్పుడు వాయనాడ్ గురించి మాట్లాడుకుంటోంది. సుందరమైన ఈ ప్రదేశంలో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి వంద మందికి పైగా చనిపోయారు. వాతావరణం పరిస్థితులు ఈ ఘటనకు ఒక కారణమైతే.. అక్కడ జరిగే రియల్ ఎస్టేట్, ప్రైవేట్ టూరిజం కూడా మరో కారణంగా తెలుస్తోంది.
కేరళకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అందులో చాలా మంది వాయనాడ్‌ను ఇష్టపడుతారు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అందించే ఆహ్లాదం మాటల్లో చెప్పలేం. అనుభవించి తీరాల్సిందే. కానీ కొండచరియలు విరిగిపడిన ఘటనతో ప్రకృతికి కోపం వస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో చూపించింది. అనేక మంది ఈ విపత్తలో చనిపోయారు. చాలా మంది గల్లంతయ్యారు. అయితే ఈ ఘటనకు వాతావరణ పరిస్థితులు మాత్రమే కాదు.. అక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్, ప్రైవేట్ టూరిజం కూడా ఓ కారణంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రియల్ ఎస్టేట్ దురాశ, పర్యాటక అభివృద్ధికి పెట్టుబడుల ఆకర్షణ వల్ల అందమైన వాయనాడ్‌లో విపత్తు సంభవించిందా? అనేది చాలా మంది వేసే ప్రశ్న. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న వాయనాడ్‌లో చాలా ఏళ్లుగా రియల్ ఎస్టేట్ దందా కూడా పెద్దగానే నడుస్తోంది.
పెరిగిన నిర్మాణాలు
పదేళ్లలో భవనాలు, ప్రత్యేకించి రిసార్ట్‌లు, హోమ్‌స్టేల నిర్మాణంలో 30 నుంచి 40 శాతం పెరుగుదల ఉంది. మరో విషయం ఏంటంటే.. ఈ రిసార్ట్‌లు, హోమ్‌స్టేలలో ఎక్కువ భాగం వాయనాడ్‌లోని వివిధ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలల్లోనే ఉన్నాయి. కొండ శిఖరాలపై ఇష్టం వచ్చిన రీతిలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి, అడవులను నరికివేయడం, నదీ గర్భాల పక్కన కూడా నిర్మాణాలు జరిగాయి. ఇందుకు ఉదాహరణ ఏంటంటే.. ధ్వంసమైన అనేక హోమ్‌స్టేలు, రిసార్ట్‌లు నది ఒడ్డున కనిపించడం. నది దాని దారిన అదిపోతుంటే.. అడ్డుకట్ట వేసినట్టుగా నిర్మాణాలు కూడా ప్రకృతి విపత్తులకు కారణమవుతాయి. నది వెళ్లే దారిని తగ్గిస్తే.. అది మనల్ని ఇబ్బంది పెడుతుంది.
దగ్గరలోనే పెద్ద ప్రాజెక్ట్
కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో రూ. 2000 కోట్లతో మెగా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రతిపాదించారు. ఇది పర్యావరణ సమస్యల కంటే అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోందని అర్థమవుతోంది.
రియల్ ఎస్టేట్ వృద్ధి
మెప్పాడిలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో, చుట్టుపక్కల గత నాలుగేళ్లలో చాలా రిసార్ట్‌లు నిర్మించారు. 2011లో గాడ్గిల్ కమిటీ నివేదికలో ఇవి ప్రత్యేక జోన్‌లని స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రాంతాల్లో నిర్మాణ ప్రయోజనాల కోసం అనుమతులు ఇవ్వడం చాలా ఆందోళనకరం. వాయనాడ్ ప్రాంతానికి పర్యాటకంగా మంచి పేరుంది. దీంతో రియల్ ఎస్టేట్ వృద్ధికి భారీ డిమాండ్ పెరుగుతోంది.
వాయనాడ్‌కు గత కొన్నేళ్లలో దేశీయ పర్యాటకుల రాక 35 శాతం దాకా పెరిగింది. ఈ కారణంగా బతేరి, కల్పత్త తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో హోమ్‌స్టేలు వెలుస్తున్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా ఉన్న ఇక్కడ ప్రకృతిని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అక్రమ నిర్మాణాలు
2011లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల ప్యానెల్ నివేదిక ప్రకారం వాయనాడ్‌లోని వైతిరి, మనంతవాడి, సుల్తాన్ బతేరిలాంటి తాలూకాలను పర్యావరణ సున్నితమైన జోన్ 1లో చేర్చారు. అంటే అటవీయేతర ఉపయోగాలకు, వ్యవసాయేతర వినియోగానికి అనుమతించరు. కానీ ఇవి నిబంధనల వరకే ఉన్నాయని చాలా మంది చెప్పే మాట. ఎందుకంటే.. పైన చెప్పిన చాలా ప్రాంతాల్లో గత పది పదిహేను ఏళ్లలో పెద్ద సంఖ్యలో హోమ్‌స్టేలు, రిసార్ట్‌లు వచ్చాయి. అక్రమంగా నిర్మించే రిసార్ట్‌లు, హోమ్‌స్టేలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ప్రకృతి దాని పని అది చేసుకుంటూ పోతుంది. అయితే దానికి ఆటంకం కలిగిస్తే ఇలాంటి విపత్తులు తప్పవని మరోసారి రుజువైంది. కొండలను తవ్వి.. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ టూరిజం పేరుతో నిర్మాణాలు చేస్తే.. భవిష్యత్తులో కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పేందుకు వాయనాడ్ ఘటనే ఓ ఉదాహరణ.