Ajit Pawar Wish: ‘‘మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని కావాలి’’- అజిత్ పవార్ లక్ష్యం; ఎన్సీపీ చీఫ్ గా శరద్ పవార్ తొలగింపు
Ajit Pawar Wish: మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని కావాలన్న తన ఆశ, ఆశయాన్ని ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ మరోసారి బయటపెట్టారు.
Ajit Pawar Wish: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి, అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన (షిండే) వర్గంతో కలిసిన అజిత్ పవార్ తాజాగా తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని కావడమే తన లక్ష్యమని, సీఎం అయితేనే, ప్రజల సంక్షేమానికి సంబంధించి తన వద్ద ఉన్న ప్రణాళికలను అమలు చేయడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ముంబైలో బుధవారం తన మద్దతుదారులు, అనుచరుల సమావేశంలో అజిత్ పవార్ (Ajit Pawar) ఈ వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు ఎన్సీపీకే వచ్చినా.. సీఎం పదవిని కాంగ్రెస్ కు అప్పజెప్పి శరద్ పవార్ తప్పు చేశారని, అలా చేయకుండా ఉండి ఉంటే, ఇప్పటివరకు కూడా మహారాష్ట్రకు ఎన్సీపీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండేవాడని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. తాజాగా, ఎన్సీపీని చీల్చి అధికార పార్టీలతో జత కల్సిన ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.
New CM for Maharashtra!: షిండే ను మారుస్తారా?
అజిత్ పవార్ తన మద్దతుదారులైన సుమారు 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార పక్షంలో చేరిన తరువాత.. మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. గతంలో శివసేన ను చీల్చి, బీజేపీతో చేతులు కలిపి, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన శివసేన తిరుగుబాటు నేత షిండేకు అనూహ్యంగా, ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది బీజేపీ. ఎన్సీపీని చీల్చడం వల్ల మహారాష్ట్ర ప్రజల్లో, ఎన్సీపీ మద్దతుదారుల్లో వ్యక్తమయ్యే వ్యతిరేకతను పోగొట్టుకోవడం కోసం ఇప్పుడు అజిత్ పవార్ కు సీఎం పదవిని ఇస్తారన్న వాదన మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ హామీ పైననే అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చారని వారు చెబుతున్నారు.
శరద్ పవార్ కు ఉద్వాసన
మరోవైపు, బుధవారం ముంబైలో సమావేశమైన అజిత్ పవార్ మద్దతుదారులు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడి పదవి నుంచి సీనియర్ లీడర్ శరద్ పవార్ ను తొలగించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్సీపీ పేరు, జెండా, ఎన్నికల గుర్తు తమకే చెందాలని వారు ఆ లేఖలో ఎన్నికల సంఘాన్ని కోరారు. సోనియాగాంధీతో విబేధాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని (NCP) శరద్ పవార్ స్థాపించారు. నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలతో పాటు, జాతీయ రాజకీయాల్లో కూడా ఎన్సీపీ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా, తాను స్వయంగా స్థాపించిన పార్టీ అధ్యక్ష పదవి నుంచే శరద్ పవార్ ను అజిత్ పవార్ తొలగించారు.