Census in India : దేశవ్యాప్తంగా జనగణన- త్వరలోనే అధికారిక ప్రకటన!
Census in India : దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణపై అమిత్ షా ఓ ప్రకటన చేశారు. జనాభా లెక్కల ప్రక్రియపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు.
2020 నుంచి వాయిదా పడుతూ వస్తున్న జనగణన ప్రక్రియపై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి అమిత్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యమైన భారత జనాభా గణనను నిర్వహించడంపై అడిగిన ప్రశ్నకు.. ‘త్వరలోనే ప్రకటన వస్తుంది’ అని అమిత్ షా ఈ సమాధానమిచ్చారు. జనగణనను ప్రకటించినప్పుడు అన్ని వివరాలను బహిర్గతం చేస్తామని చెప్పారు.
భారతదేశం 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణనను నిర్వహిస్తోంది. ఈ దశాబ్దపు జనాభా గణన మొదటి దశ 2020 ఏప్రిల్ 1న ప్రారంభమవ్వాల్సి ఉంది. కాని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా జనాభా గణన, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) అప్డేట్ ప్రక్రియ జరగాల్సి ఉండగా, కోవిడ్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది.
కుల గణన నిర్వహించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జనాభా గణనపై అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజా సమాచారం లేకపోవడంతో ప్రభుత్వ సంస్థలు 2011 జనాభా లెక్కల ఆధారంగానే విధానాలను రూపొందించి సబ్సిడీలను కేటాయిస్తున్నాయి. కానీ అప్పటికీ, ఇప్పటికీ దేశ జనాభా చాలా రెట్లు పెరిగిపోయిందనడంలో సందేహం లేదు.
మొత్తం జనాభా లెక్కలు, ఎన్పీఆర్ ప్రక్రియ వల్ల ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది ఎప్పుడు జరిగినా పౌరులకు స్వీయ గణనకు అవకాశం కల్పించే మొదటి డిజిటల్ జనాభా గణన అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.
ప్రభుత్వ ఎన్యూమరేటర్ల ద్వారా కాకుండా సొంతంగా జనాభా గణన పత్రాన్ని నింపే హక్కును వినియోగించుకోవాలనుకునే పౌరులకు ఎన్పీఆర్ని తప్పనిసరి చేశారు.
ఇందుకోసం సెన్సస్ అథారిటీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ తయారైంది. కానీ ఇది ఇంకా ప్రారంభం కాలేదు.
స్వీయ గణన సమయంలో ఆధార్ లేదా మొబైల్ నంబర్ తప్పనిసరిగా సేకరిస్తారు.
జనాభా లెక్కల్లో ఏ ప్రశ్నలు ఉండొచ్చు?
రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం అడిగేందుకు 31 ప్రశ్నలను సిద్ధం చేసింది. ఒక కుటుంబానికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్, సైకిల్, స్కూటర్ లేదా మోటార్ సైకిల్ లేదా మోపెడ్ ఉన్నాయా, వారికి కారు, జీపు లేదా వ్యాన్ ఉందా అనే ప్రశ్నలు ఉంటాయి.
ఇంట్లో వారు వినియోగించే తృణధాన్యాలు, తాగునీటి ప్రధాన వనరు, ప్రధాన లైటింగ్ వనరు, మరుగుదొడ్డి సౌకర్యం, మరుగుదొడ్డి రకం, వ్యర్థ నీటి అవుట్ లెట్ లభ్యత, స్నాన సదుపాయం లభ్యత, వంటగది, ఎల్పీజీ / పీఎన్జీ కనెక్షన్ లభ్యత, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం, రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్ లభ్యతను కూడా పౌరులను అడుగుతారు.
ఇంటి అంతస్తు, గోడ, పైకప్పు ప్రధాన సామాగ్రి, ఇంటి పరిస్థితి, సాధారణంగా ఇంట్లో నివసిస్తున్న వారి సంఖ్య, ఇంటి పెద్ద మహిళా, ఇంటి పెద్ద షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందినవారా, ఇంటి ఆధీనంలో ఉన్న నివాస గదుల సంఖ్య గురించి పౌరులను అడుగుతారు. ఇంటిలో నివసిస్తున్న వివాహిత జంట(లు) సంఖ్యను కూడా అఢిగే అవకాశం ఉంది.
సంబంధిత కథనం